- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీవీపీలో ‘ఇన్‌చార్జి’ కష్టాలు: 40 రోజులుగా లేని రెగ్యులర్ కమిషనర్
టీవీవీపీకి కరువైన రెగ్యులర్ కమిషనర్.. స్తంభించిన 940కి పైగా డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల పోస్టింగులు.. వైద్యుల్లో తీవ్ర అసంతృప్తి!

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యరంగంలో రెండో అతిపెద్ద వ్యవస్థ, 184 ఆస్పత్రులు, సుమారు 10 వేల మంది ఉద్యోగులు.. ఇంత బృహత్తర వ్యవస్థ పర్యవేక్షణకు పెద్ద అధికారి కరువయ్యారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్సీలు), జిల్లా ఆస్పత్రుల్లో సెకండరీ వైద్యానికి పెద్ద దిక్కుగా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)కు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో పరిపాలన పడకేసింది. మే 31న డా. అజయ్ కుమార్ రిటైర్ అవ్వగా తదుపరి కమిషనర్ కోసం 10 మంది ఆశావాహులతో కూడిన లిస్టును హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో సీఎంవోకు పంపించారు. ఈ ఫైల్ పంపి రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు కమిషనర్ ఎవరో ప్రభుత్వం తేల్చడం లేదు. ప్రస్తుతం మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో, పూర్తిస్థాయి పర్యవేక్షణ కరువై ఫైళ్ల కదలికలు నిలిచిపోయాయి.
ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినాకు తప్పని పని ఒత్తిడి
హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఇప్పటికే శాఖాపరమైన కీలక బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. టీవీవీపీ లాంటి పెద్ద విభాగానికి ఇన్‌చార్జి బాధ్యతలూ చూస్తుండటంతో రోజువారీ పరిపాలన నత్తనడకన సాగుతోంది. ఆర్థిక అధికారాల ఆమోదం, పెండింగ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల ఫైళ్లు నెలల తరబడి మూలనపడ్డాయి. జేఏసీ డిమాండ్ చేస్తున్న ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎక్స్‌టెన్షన్ ఆర్డర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. తమ సమస్యలపై చెప్పుకునేందుకు హెచ్ఓడీ లేరని వాపోతున్నారు.
సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి..
పది మందితో కూడిన సీనియారిటీ లిస్టు ప్రస్తుతం సీఎం వద్దే పెండింగ్‌లో ఉన్నది. టీవీవీపీ కమిషనర్ పోస్టుకు సంబంధించి ఎలాంటి గైడ్‌లైన్స్ లేకపోవడంతో, ప్రభుత్వం సీనియార్టీతో సంబంధం లేకుండా ఎవరినైనా నియమించుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్‌హెచ్)గా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతానికైతే కమిషనర్‌గానే నియామకం చేపట్టాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్)లలో సీనియారిటీ ప్రాతిపదికన పదవులు ఇస్తున్న తరహాలోనే, టీవీవీపీలోనూ కమిషనర్ నియామకం చేపట్టాలని డాక్టర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే..
టీవీవీపీ పరిధిలో నెలకొన్న సమస్యలపై ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. ఇన్‌చార్జి పాలనకు స్వస్తి పలికి ఈ విభాగాలకు వెంటనే రెగ్యులర్ కమిషనర్ లేదా డైరెక్టర్‌ను నియమించాలని, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో తలెత్తిన లోపాలు, అభ్యంతరాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. సిబ్బంది సర్దుబాటుకు సంబంధించిన రీడిప్లాయ్‌మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడంతో పాటు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాయి.
అర్హులైన వివిధ కేడర్ల ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించాలని, రెగ్యులరైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల నిష్పత్తికి అనుగుణంగా తగిన సిబ్బందిని, నూతన పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గడువు ముగియక ముందే.. ముందస్తుగానే కొనసాగింపు ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతున్నా.. కమిషనర్ లేక పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కమిషనర్ నియామకం వెంటనే చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు, ఇతర సిబ్బంది ఆందోళనకు దిగుతున్నా.. పై స్థాయిలో కదలిక రావడం లేదు.
నిలిచిపోయిన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల పోస్టింగులు..
కమిషనర్ లేకపోవడంతో టీవీవీపీ పరిధిలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ స్తంభించింది. 612 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 330కి పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ఆలస్యంగా సాగుతున్నది. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఇప్పటికే వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్లు అందించినప్పటికీ, ఇంతవరకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇవ్వలేదు. నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి డీఎంఈ, డీహెచ్ పరిధిలో నియామకాలు వేగంగా జరుగుతుంటే.. టీవీవీపీలో మాత్రం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ సజావుగా సాగాలన్నా, సిబ్బంది కొరత తీరాలన్నా ప్రభుత్వం తక్షణమే స్పందించి టీవీవీపీకి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.






