- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ పై టీవీఆర్ఎఫ్ సంప్రదింపుల సమావేశం
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక(టీవీఆర్ఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక(టీవీఆర్ఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2026 జూన్ 25 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) అమలును సమీక్షించేందుకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రజా సంప్రదింపుల సమావేశంలో, ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత సరళంగా, ప్రజలకు అనుకూలంగా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వేదిక పలు ముఖ్యమైన డిమాండ్లను చేసింది.
ఈ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ పౌరసంఘాల ప్రతినిధులు, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు, సామాజిక నాయకులు, ఓటర్లతో ప్రత్యక్షంగా పనిచేస్తున్న వ్యక్తులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు ఎదుర్కొంటున్న అనేక ఆచరణాత్మక సమస్యలను వారు తమ అనుభవాల ఆధారంగా వివరించారు.జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ షాలను ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు. ప్రజల్లో తగిన అవగాహన లేకపోవడం, ప్రక్రియలోని సంక్లిష్టత, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు, వివిధ పోలింగ్ ప్రాంతాల్లో అసమాన అమలు, బూత్ లెవల్ అధికారులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు అర్హులైన అనేక మంది ఓటర్లకు ఆటంకాలుగా మారుతున్నాయని సమావేశం గుర్తించింది.
ముఖ్యంగా ఆర్థికంగా బలహీన కుటుంబాలు, వలస కార్మికులు, వృద్ధులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు నిర్దేశించిన పత్రాలను సమర్పించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ఫలితంగా వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని పౌరసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో వార్తాపత్రికలు, టెలివిజన్, రేడియో, డిజిటల్ మీడియా, బహిరంగ హోర్డింగ్‌ల ద్వారా విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించి, ఇప్పటికే ఓటరు గుర్తింపు కార్డు ఉన్నవారితో సహా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారమ్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంగా తెలియజేయాలని ప్యానెల్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రతి పోలింగ్ ప్రాంతంలో ప్రజలకు సహాయం అందించే కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులను ప్రతిరోజూ అందుబాటులో ఉంచాలి.
వారి పేర్లు, సంప్రదింపు వివరాలు, విధి సమయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ఓటర్ల ధృవీకరణ, ఫిర్యాదుల పరిష్కారం కోసం క్రమం తప్పకుండా బూత్ సభలు నిర్వహించాలని సమావేశం కోరింది. ప్రత్యేకంగా, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, మీ సేవా కేంద్రాల ద్వారా శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసే వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల సంఘం ఈ ధ్రువీకరణ పత్రాన్ని చెల్లుబాటు అయ్యే పత్రంగా గుర్తించినప్పటికీ, పేద కుటుంబాలు, అసంఘటిత రంగ కార్మికులు నిర్దేశించిన ఇతర పత్రాలు చాలామందికి అందుబాటులో లేవని వేదిక పేర్కొంది. శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాన్ని సులభంగా, పారదర్శకంగా, నిర్ణీత కాలవ్యవధిలో జారీ చేసే విధానం అమల్లోకి వస్తే, కేవలం పత్రాల లేమి కారణంగా అర్హులైన పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కోల్పోకుండా ఉంటారని వేదిక అభిప్రాయపడింది. రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఓటరు జాబితాలను వెంటనే నవీకరించి, అవి సమగ్రంగా, విశ్వసనీయంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వేదిక కోరింది.






