జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీ ఏర్పాటుకు కృషి: మంత్రి తుమ్మల

by Bhanu |

జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల సాగు రోజురోజుకు పెరుగుతున్నందున త్వరలోనే జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీ ఏర్పాటుకు కృషి: మంత్రి తుమ్మల
X

దిశ, చిట్యాల : జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల సాగు రోజురోజుకు పెరుగుతున్నందున త్వరలోనే జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నూతన రాష్ట్రం గా ఉన్నప్పటికీ, అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ 33 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాలో వేయడం జరిగిందని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 లక్షల 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

ధాన్యం విక్రయించిన రైతులకు మూడు నాలుగు రోజుల్లోనే వారి ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రైతులను కాపాడుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అందులో భాగంగానే సీఎం అహర్నిశలు రైతుల అభివృద్ధి కోసమే కష్టపడుతున్నారన్నారు. రానున్న సీజన్లో రైతులు నాట్లు వేయకముందే వారి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రైతులు ముందస్తు అవగాహనతో కాలానుగుణంగా పంటలు సాగు చేసి వృద్ధి చెందాలని అందులో భాగంగానే జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి తద్వారా వృద్ధిలోకి రావాలన్నారు.

ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రోద్బలంతోనే ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేశానని ఇప్పటికీ ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేస్తూ లాభాలను అర్జిస్తున్నానన్నారు. ఈమధ్య శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆయిల్ ఫామ్ తోటల సాగును చేపట్టారని ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి రైతులకు ధైర్యం, భరోసా ఇవ్వాలన్నారు. రైతులను ఆర్థికంగా, స్థిరంగా నిలబెట్టే పంట ఆయిల్ ఫామ్ పంట అని నీటి అవసరం అంతగా అవసరం లేని పంట కావడం చేత రైతులు దీనిపై దృష్టి సారించాలన్నారు. అలాగే హార్టికల్చర్ పంటలపై కూడా రైతులు దృష్టి సారించి లాభాలను అర్ధించాలన్నారు.

చిట్యాల మండలానికి సంబంధించిన 8 గ్రామపంచాయతీలు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉండటం వల్ల చిట్యాల వ్యవసాయ మార్కెట్ కు ఆదాయం రాకుండా పోతుందని త్వరలోనే ఎనిమిది గ్రామాలను కూడా చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని అలాగే నార్కెట్పల్లి మండలంలో సబ్ మార్కెట్ యాడ్ ఏర్పాటుకు కృషి చేస్తాననీ హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని వాటి అన్నింటిని అధిగమించి రైతులలో ఆనందాన్ని చూసే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు జరిగిందని ఆ విధంగా ముందుకు వెళుతుందన్నారు. రైతులు అంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బోనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, చిట్యాల పిఎసిఎస్ చైర్మన్ మల్లేష్ గౌడ్, కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, డిసిసి కార్యదర్శి పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..

Next Story