హ్యాండ్లూమ్, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయించాలి.. అమిత్​షా‌కు తుమ్మల రిక్వెస్ట్

by Ramesh Naini |   (  Updated:2025-09-04 16:52:01  IST  )

వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై విధిస్తున్న 12 శాతం (GST) జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

హ్యాండ్లూమ్, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయించాలి.. అమిత్​షా‌కు తుమ్మల రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై విధిస్తున్న 12 శాతం (GST) జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో మంత్రుల బృందంతో కేంద్ర హోంమంత్రి అమిత్​షా‌ (Amit Shah)ను కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వివరిస్తూ వ్యవసాయం, ఉద్యానవన రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, రైతులకు ఆధునిక యంత్రాలు, నీటిపారుదల సాంకేతికత అందుబాటులో ఉంటే ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై జీఎస్టీ విధించడం, రైతులపై తీవ్రమైన ఆర్థిక భారంగా మారిందన్నారు. చిన్న, సన్న రైతులు ఆధునిక పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులపై ఆర్థిక భారం తగ్గించడానికి, ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు. చిన్న రైతులు కూడా సాంకేతికతను ఉపయోగించుకునేందుకు వీలుగా, ఉత్పాదకతను పెంచి దేశ ఆహార భద్రత మరింత బలపడేదిశగా ఉండాలంటే ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఉన్న జీఎస్టీని మినయించాలని కోరారు.

హ్యాండ్లూమ్ రంగానికి మినహాయింపు :

చేనేత రంగం వ్యవసాయ రంగం తరువాత గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగమని, తెలంగాణ నేతన్నలు తయారు చేసిన వస్త్రాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల పట్టు, నారాయణపేట్ పట్టు, గొల్లభామ చీరలు, వరంగల్ దుర్రీలు, కరీంనగర్ డబుల్ క్లాత్ బెడ్‌షీట్లు వంటి ప్రత్యేక జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులు భారత వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,046 నేతన్నలు, 34,569 అనుబంధ కార్మికులు జీవనోపాధి కోసం హ్యాండ్లూమ్ రంగంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. మిల్లులు, పవర్‌లూమ్‌లతో పోలిస్తే హ్యాండ్లూమ్ రంగంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడంతో పాటు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం నేతన్నల ఉత్పత్తులు మార్కెట్లో పోటీ తట్టుకోలేని పరిస్థితిని తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తుల ధరలు పెరిగి, వినియోగదారుల డిమాండ్ తగ్గి, నేతన్నలు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫలితంగా, అనేక మంది నేతన్నలు తమ సంప్రదాయ వృత్తిని వదిలి వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. ఖాదీ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఉన్నప్పటికీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. నేతన్నల జీవితాలను కాపాడటానికి, భారతీయ వారసత్వాన్ని రక్షించడానికి హ్యాండ్లూమ్ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఆయిల్ పామ్ రైతుల రక్షణ ఇవ్వాలి :

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ అమలు క్రమంలో తెలంగాణ చేసిన కృషిని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.06 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, దేశంలోనే అత్యధిక విస్తీర్ణం తెలంగాణ దేనని తెలిపారు. దాదాపు 72 వేల మంది రైతులు ఈ పంటపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. క్రూడ్ పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించడం రైతులకు తీవ్ర సమస్యగా మారిందని, దీంతో దేశీయ ధరలు క్షీణించి రైతులకు చెల్లించే Fresh Fruit Bunches ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 లో ఉన్నట్లుగా 44 శాతం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, కనీసం NMEO-OP కీలక దశలో స్థిరమైన విధానం కొనసాగాలన్నారు. రైతు, నేతన్న సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. జీఎస్టీ మినహాయింపు, ఆయిల్ పామ్ రైతుల రక్షణ, నేతన్నల ఉపాధి భద్రత వంటి అంశాల్లో కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇవి కేవలం రాష్ట్రానికి కాకుండా దేశ ఆహార భద్రత, వారసత్వ కళలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును కాపాడే నిర్ణయాలు అవుతాయని పేర్కొన్నారు.

Next Story