భక్తులకు ఊరట.. శ్రీవాణి ఆన్‌లైన్‌ కరెంట్‌ బుకింగ్‌లో టీటీడీ కీలక మార్పులు

by Ramesh Naini |

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శుభవార్త అందించింది.

భక్తులకు ఊరట.. శ్రీవాణి ఆన్‌లైన్‌ కరెంట్‌ బుకింగ్‌లో టీటీడీ కీలక మార్పులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శుభవార్త అందించింది. శ్రీవాణి ట్రస్ట్‌ ఆన్‌లైన్‌ కరెంట్‌ బుకింగ్‌ విధానంలో భక్తులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విరాళం, దర్శనం టికెట్ సొమ్మును ఒకేసారి చెల్లించే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది.

ఇక ఒకేసారి రూ.10,500 చెల్లింపు..

గతంలో భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కు మొదట రూ.10,000 విరాళం ఇచ్చి, ఆ తర్వాత ఇతర వివరాలు నమోదు చేసి వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్ కోసం రూ.500 చెల్లించాల్సి వచ్చేది. అయితే, ఈ రూ.500 చెల్లించేలోపే టికెట్లు బుక్ అయిపోవడంతో, అప్పటికే రూ.10 వేలు విరాళం ఇచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో టీటీడీ స్పందించింది. శుక్రవారం నుంచి విరాళం (రూ.10 వేలు), దర్శన టికెట్ (రూ.500) రెండూ కలిపి ఒకేసారి రూ. 10,500 చెల్లించే నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

చెల్లింపు విధానాలు ఇవే..

నూతన చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేసేందుకు పేమెంట్‌ గేట్‌వే లావాదేవీల బాధ్యతను ‘యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (UBI)కు టీటీడీ అప్పగించింది. యూపీఐ (UPI), డెబిట్ కార్డు (Debit Card), క్రెడిట్ కార్డు (Credit Card), నెట్ బ్యాంకింగ్ (Net Banking) భక్తులు ఈ విధానాల ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

శ్రీవాణి కరెంట్ బుకింగ్ ప్రధాన నియమాలు..

భక్తుల సౌకర్యార్థం ఆఫ్‌లైన్‌లో జారీచేసే శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లను ఈ ఏడాది జనవరి 9 నుంచి కరెంట్‌ బుకింగ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. కరెంట్‌ బుకింగ్‌ కింద ఏరోజుకారోజు 800 టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను విడుదల చేస్తారు. ఒక బుకింగ్‌లో గరిష్టంగా నలుగురు (1+3) భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక ఐడీపై ఒకసారి టికెట్‌ పొందితే, ఆ ఐడీతో మళ్లీ వారం రోజుల పాటు టికెట్‌ పొందడానికి వీలుండదు. టీటీడీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో శ్రీవాణి దర్శన టికెట్లు పొందే ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా మారిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story