- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేటలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాల్సిందే.. టీఎస్‌జేఏ ఆధ్వర్యంలో పాదయాత్ర.. అధికారులకు వినతి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాల్సిందేనని సీనియర్ పాత్రికేయులు భూపతి రాములు గౌడ్, సుంకర బోయిన వెంకటయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాల్సిందేనని సీనియర్ పాత్రికేయులు భూపతి రాములు గౌడ్, సుంకర బోయిన వెంకటయ్య యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్‌జెఏ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతియుత పాదయాత్రకు వారు మద్దతు తెలిపి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి పీఎస్ఆర్ సెంటర్ వాణిజ్య భవనం, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ వరకు పాదయాత్ర నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉద్యమ చరిత్ర కలిగిన సూర్యాపేటలో ఇప్పటికీ సొంత ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడం బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ సంఘం పిలుపునిచ్చినా తాము ఐక్యంగా పాల్గొంటామని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు
ఈ సందర్భంగా టీఎస్‌జేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, సొంత భవనం లేక జర్నలిస్టులు చెట్ల కింద, ప్రైవేట్ భవనాల వద్ద, హోటళ్లలో గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సమాజాన్ని చైతన్యపరుస్తున్న ఫోర్త్ ఎస్టేట్‌కు కనీస వసతులు లేకపోవడం బాధాకరమని అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.
దఫలవారీగా ఉద్యమాలు కొనసాగిస్తాం
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వరకు దఫలవారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని గుర్తుచేస్తూ, ప్రభుత్వాలు ఈ వర్గాన్ని విస్మరించకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని యూనియన్లు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌జెఏ సభ్యులతో పాటు ఇతర యూనియన్లకు చెందిన సీనియర్ జర్నలిస్టులు, పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.






