పిల్లల నమోదు పెంచమంటూ టీచర్లను తొలగిస్తారా?

by Ajay Maddhiboyina |

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ఒకవైపు చెబుతూనే, మరోవైపు ప్రాథమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను తొలగించడంపై

పిల్లల నమోదు పెంచమంటూ టీచర్లను తొలగిస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ఒకవైపు చెబుతూనే, మరోవైపు ప్రాథమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను తొలగించడంపై తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్దుబాటు ఉత్తర్వులు దారుణమని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతున్న నేపథ్యంలో, ఈ సంవత్సరం నమోదు పెంపుకోసం కలిసికట్టుగా కృషి చేద్దామని విద్యాశాఖ అధికారులు చెప్పారని టిఎస్ యుటిఎఫ్ నాయకులు గుర్తుచేశారు. అయితే, అధికారుల మాటలు నమ్మి వేసవి సెలవుల్లోనే విద్యార్థుల నమోదు కోసం ప్రచార యాత్రలు నిర్వహిస్తుంటే, దానికి విరుద్ధంగా ఏకపక్షంగా సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం కాకుండానే, విద్యార్థుల నమోదును పట్టించుకోకుండా జూన్ 13 నాటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, సంఘాలు కోరుతుంటే, ఆ డిమాండ్లను పట్టించుకోకుండా ప్రాథమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు తరలించాలనే నిర్ణయం ప్రాథమిక విద్యా రంగానికి "గొడ్డలిపెట్టు" వంటిదని టిఎస్ యుటిఎఫ్ అభిప్రాయపడింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిపై అభ్యంతరాలు:

ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 మంది విద్యార్థుల లోపు ఒక ఉపాధ్యాయుడు, 11 నుండి 60 మంది వరకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే ఆదేశం సమంజసం కాదని టిఎస్ యుటిఎఫ్ స్పష్టం చేసింది. అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 లోపే ఉంటుందని, ఉన్న ఉపాధ్యాయులను తొలగిస్తే తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఎలా కలుగుతుందో అధికారులు ఆలోచించాలని సూచించింది. కనీసం 40 మంది విద్యార్థుల వరకు ఇద్దరు, 41 నుండి 60 వరకు ముగ్గురు, 61 నుండి 90 వరకు నలుగురు ఉపాధ్యాయులు ఉండే విధంగా నిబంధనలను సవరించాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ప్రాథమిక పాఠశాలలను సహజ మరణానికి గురిచేసే ఈ సర్దుబాటు ఉత్తర్వు లను సవరించాలని తెలిపింది. లేదంటే ఉపాధ్యాయ, పౌర సంఘాలతో కలిసి ఐక్య పోరాటం నిర్వహిస్తామని టిఎస్ యుటిఎఫ్ ప్రకటించింది.


Next Story