TSUTF: వెనక్కి తగ్గం.. స్వతంత్ర పోరాటం చేస్తాం

by Gantepaka Srikanth |

కొద్దిమంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

TSUTF: వెనక్కి తగ్గం.. స్వతంత్ర పోరాటం చేస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొద్దిమంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ఆఫీసు బేరర్స్ సమావేశం శనివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో చావ రవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూకే పాఠశాలల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి ఆహ్వానించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

ఎవరి ప్రయోజనాల కోసం ఈ పాఠశాలలను ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యతను విస్మరించి, కొందరికే నాణ్యమైన విద్యను పరిమితం చేయాలనే ఆలోచన సరికాదన్నారు. గత ప్రభుత్వం కొన్ని వందల గురుకులాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసిందని, ఈ ప్రభుత్వం కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తోందన్నారు. పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లుల మంజూరు, వివిధ యాజమాన్యాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలని లేని పక్షంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటం చేస్తామని ప్రకటించారు. మార్చి 29న జోగులాంబ జిల్లా గద్వాల జిల్లా ఆలంపూర్‌లో జరిగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెంకట్, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Next Story