రాత్రికిరాత్రే మారిన పరిణామాలు.. ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బీకి కవిత..

by Gantepaka Srikanth |

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసిన అంశం కవిత పార్టీ వ్యవహారం. అయితే.. ఆమె పార్టీ పేరు వ్యవహారంలో ట్విస్టులు చోటుచేసుకుంటున్నట్లు జాగృతి వర్గాల ద్వారా తెలిసింది.

రాత్రికిరాత్రే మారిన పరిణామాలు.. ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బీకి కవిత..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసిన అంశం కవిత పార్టీ వ్యవహారం. అయితే.. ఆమె పార్టీ పేరు వ్యవహారంలో ట్విస్టులు చోటుచేసుకుంటున్నట్లు జాగృతి వర్గాల ద్వారా తెలిసింది. ముందు నుంచి పలు రకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరునే పార్టీకి ఫైనల్ అని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. చివరి నిమిషంలో పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మారుస్తూ డిసైడ్ చేసినట్లు తెలిసింది. మొదట తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రాజకీయ పార్టీగా అడుగుపెట్టాలని ప్లాన్ ‘ఏ’తో ముందుకెళ్లిన కవిత.. చివరి నిమిషంలో అనూహ్యంగా ప్లాన్ ‘బీ’కి మారినట్లు సమాచారం.

పర్మిషన్ ఇవ్వని ఎన్నికల సంఘం..

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయాలని కవిత ముందుగా భావించారు. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి సైతం అదే పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. మధ్యలో కొన్ని టెక్నికల్ అంశాలపై సీఈసీ అభ్యంతరాలు తెలిపినా వాటిని కరెక్షన్ చేసి మరోసారి సమర్పించారు. అయినప్పటికీ సీఈసీ నుంచి అనుమతి రాలేదు. దాంతో కవిత గత నెలలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం పార్టీ ప్రాసెస్‌ను వేగవంతం చేయాలని సీఈసీని ఆదేశించింది. అయినప్పటికీ.. సీఈసీ నుంచి అనుమతి దక్కలేదు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రతిపాదన నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కవిత టీమ్ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది.

అందుకే తెరమీదకు టీఆర్ఎస్..

ఈ పరిణామాల మధ్య రాత్రికిరాత్రే పార్టీ పేరును మారుస్తూ కవిత నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో ప్లాన్ బిని అమలు చేసేలా కార్యకర్తలకు సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దాంతో అప్పటికే జాగృతి కార్యకర్త పేరిట రిజిష్టర్ అయి ఉన్న ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరును తెరమీదకు తెచ్చారని సమాచారం. దాంతో అదే పేరును ఫైనల్ చేస్తే ఒక్క రాత్రిలోనే కీలక నిర్ణయం తీసుకుని పార్టీ పేరును టీఆర్ఎస్‌‌ను ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ పార్టీగా వినియోగించేందుకు సడెన్‌గా వ్యూహం మార్చినట్లు తెలిసింది. అందుకే.. పార్టీ జెండాను సైతం ఏర్పాటు చేయలేకపోయారన్న ప్రచారం నడుస్తున్నది. అలాగే అత్యంత కీలకమైన ఎన్నికల గుర్తును సైతం కవిత ప్రకటించలేదు. ఇవన్నీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయాలే అని తెలిసింది. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి సంబంధించి పార్టీ ప్రకటన సందర్భంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎల్లో కలర్.. బ్లూ కలర్‌లో తెలంగాణ మ్యాప్‌ను చూపించారు. అంటే జెండా కలర్ అవే అని స్పష్టం అయింది. కానీ, జెండాను మాత్రం అధికారికంగా సభా వేదికపై కవిత ఆవిష్కరించకపోవడం అందరిలోనూ చర్చకు దారితీసింది.

Next Story