ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రికి గిరిజన ఎమ్మెల్యేల వినతి

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ.. గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు.

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రికి గిరిజన ఎమ్మెల్యేల వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ.. గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. గురువారం సచివాలయంలో మంత్రి సీతక్క నేతృత్వంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలను ఉంచారు. ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.

అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు, ఇందిర గిరిజన జల వికాసం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు.

Next Story