ఇండియా కూటమిలో ముసలం.. మమత 'నేషనల్' గేమ్‍తో ప్రకంపనలు తప్పవా?

by Prasad Jukanti |   (  Updated:2026-05-06 06:48:40  IST  )

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమిలో సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్, తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ఓటమితో కూటమి అంశం మరోసారి తెరపైకి వస్తోంది.

ఇండియా కూటమిలో ముసలం.. మమత నేషనల్ గేమ్‍తో ప్రకంపనలు తప్పవా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి, తమిళనాడులో కొత్తగా పుట్టుకువచ్చిన టీవీకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించాయి. ఈ ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఘోరంగా దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, డీఎంకే ఓటమితో మరోసారి ఇండియా కూటమి అంశం తెరపైకి వస్తోంది. లోక్ సభ ఎన్నికల అనంతరం కూటమిలోని పార్టీలు ఎవరి పంథాలో వారే ముందుగు సాగుతున్న తరుణంలో ఇండి కూటమిలోని కీలక పార్టీలైన టీఎంసీ, డీఎంకే ఓటమి ఇప్పుడు కూటమిలో అలజడి రేపుతోంది. ఈ ప్రభావంతో ఇండియా కూటమి మరోసారి బలపడబోతోందా? లేక విచ్ఛిన్నం కాబోతోందా అనేది జాతీయ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

బెంగాల్ లో ఐక్యత, తమిళనాట విచ్చిన్నం:

గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఏర్పాటైన ఇండియా కూటమి ప్రారంభం నుంచి అనేక అటుపోట్లను ఎదుర్కొంటోంది. పార్టీల మధ్య సఖ్యత లేకపోవడం ఏ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాని పరిస్థితుల మధ్య కూటమిలో సఖ్యత లేకపోవడం ఎన్డీయే నెత్తిన పాలు పోసినట్లవుతోందనే చర్చ ఉంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికలు ఇండియా కూటమికి కొత్త సవాళ్లు తెచ్చిపెట్టాయి. బెంగాల్‍లో ఓడిపోయిన మమతా బెనర్జీ తాజగా మాట్లాడుతూ ఇక నుంచి తాను జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానని, తనకు ఇండియా కూటమి నేతలు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తమిళనాడులో ఓటమి పాలైన డీఎంకే విషయంలో కాంగ్రెస్‍ అనుసరిస్తున్న తీరు ఇండియా కూటమిలో చర్చగా మారింది. ఇక్కడ ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మిత్ర పక్షంగా ఉన్న డీఎంకేతో తెగదెంపులు చేసుకునేలా కాంగ్రెస్‍లోని కొంత మంది నేతలు వ్యాఖ్యలు చేయడం కూటమి ఐక్యతపై అనుమానాలకు తావిస్తోంది. నిజానికి చాలా సందర్భాల్లో ఇండియా కూటమి పట్ల ముభావంగా వ్యవహరించిన మమత పట్ల కాంగ్రెస్ పార్టీ సానుకూలత ప్రకటిస్తోందని అదే కూటమికి అన్ని పరిస్థితుల్లో మద్దతుగా నిలిచిన డీఎంకే విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో బెంగాల్‍లో కాంగ్రెస్ ఐక్యత రాగం ఆలపిస్తుంటే తమిళనాడులో మాత్రం అధికారం కోసం భిన్నంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాహుల్ పరిస్థితి ఏంటి?:

రాహుల్ గాంధీ వైఖరి పట్ల ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ వైఖరి వల్లే మోడీని ఎదుర్కోవడం లేదనే చర్చ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో తాను జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని మమతా బెనర్జీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంతో పాటు దేశమంతటా ముఖ్య నేతలతో పరిచయాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మమతాబెనర్జీనే ప్రధాన మంత్రి అనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఓక వేళ మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టుకుని నేషనల్ పాలిటిక్స్ పై దృష్టి సారిస్తే ఇండియా కూటమిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? కూటమిలో రాహుల్ గాంధీ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది కూడా ఇంట్రెస్టింగ్‍గా మారుతోంది.

బీజేపీ ఎటాక్:

తాజా పరిస్థితుల వేళ ఇండియా కూటమి అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ పై బీజేపీ ఎటాక్ మొదలు పెట్టింది. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలకు ద్రోహం చేస్తోందని దుయ్యబట్టారు. తమ కూటమి భాగస్వాములను వాడుకుని వదిలేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, ఆర్జేడీ, శివసేన, ఎన్‌సీపీ, ఇప్పుడు డీఎంకే వంటి పార్టీలను వాడుకుని వదిలేసిందని ఇండి అలయన్స్‌కు స్పష్టమైన లక్ష్యం, దార్శనికత లేవని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ తన స్వప్రయోజనాల కోసం ప్రాంతీయ మిత్రపక్షాలను వాడుకుంటోందని పూనావాలా ఆరోపించారు. ఇండి అలయన్స్ గందరగోళం, విభజన, అవినీతితో నిండి ఉందని, ఇదంతా అధికారంపై ఉన్న ఆశతోనే నడుస్తోందని ఆయన అభివర్ణించారు.

Next Story