అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ

by Gantepaka Srikanth |

రాబోయే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు నేడు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది.

అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు నేడు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అసెంబ్లీలో సమర్థవంతంగా వ్యవహరించేందుకు అవసరమైన అంశాలపై నిపుణులు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ఎలా మాట్లాడాలి? సభా నియమాలను ఎలా పాటించాలి? ప్రజా సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలి? వంటి అంశాలపై ఈ శిక్షణలో వివరంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా చట్టసభల పనితీరు, చట్టాల రూపకల్పన విధానం, సభలో ప్రశ్నలు అడగడం, చర్చల్లో పాల్గొనడం వంటి అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ శిక్షణలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ సహా పలువురు నిపుణులు పాల్గొననున్నారు.

అసెంబ్లీ చట్టాలు, విధానాలు, సభలో అనుసరించాల్సిన నిబంధనలు వంటి విషయాలపై ఆయన వివరణ ఇవ్వనున్నారు. అలాగే సభలో ప్రతిపక్ష పాత్ర, ప్రజా సమస్యలను బలంగా వినిపించే విధానం వంటి అంశాలపై కూడా ఆయన సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో పార్టీ సభ్యులు సమర్థవంతంగా తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందస్తుగా శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా అసెంబ్లీలో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు, ప్రజలకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా ప్రస్తావించాలి, ప్రభుత్వ నిర్ణయాలపై ఎలా స్పందించాలి అనే అంశాలపై కూడా శిక్షణలో సూచనలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story