ప్లీజ్.. ఒక్క బెల్ట్ షాపు ఇప్పించండి సారూ..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-30 05:36:37  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న బెల్ట్ షాపుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ప్లీజ్.. ఒక్క బెల్ట్ షాపు ఇప్పించండి సారూ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న బెల్ట్ షాపుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. షాపులను తమకే ఇప్పించాలంటూ ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వ్యాపారులు ప్రాధేయపడుతున్నారు. ఈ మధ్య లక్కీ డ్రాలో మద్యం షాపులను సొంతం చేసుకున్న వ్యాపారులకు డిసెంబరు 1 నుంచి లిక్కర్ సేల్ చేసేందుకు ఎక్సయిజ్ శాఖ అనుమతిని ఇస్తుంది. అందుకే కొత్తగా బెల్ట్ షాపు బిజినెస్ చేసేందుకు సిద్ధమైన వ్యాపారులు వాటిని సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అందుకోసం హైదరాబాద్‌కు వచ్చి రూలింగ్ పార్టీ లీడర్ల వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

పెద్ద ఎత్తున లాభాలు..

చాలా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించేందుకు యువత ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. ఎక్కువ మొత్తంలో లాభాలు ఉంటాయనే ప్రచారంతో ఆ షాపులకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రతి రోజూ కనిష్టంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు ప్రాఫిట్ ఉంటుందని టాక్ ఉంది. పైగా పెట్టుబడి సైతం రూ.లక్షల్లో ఉండదు. రూ.10 నుంచి 15 వేలు పెడితే సరిపోతుంది. సాయంత్రం వరకు పెట్టుబడితో పాటే లాభం కూడా వస్తుంది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపులను దక్కించుకునేందుకు యువత పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా ఉండే లిక్కర్ షాపుల వద్ద బెల్ట్ షాపు నిర్వాహకులు బల్క్‌గా మద్యం కొనుగోళ్లు చేస్తుంటారు. బాటిల్‌‌పై ఉండే ఎంఆర్‌పీ(MRP) ధర కంటే అదనంగా రూ.40 నుంచి రూ.100 వరకు విక్రయిస్తుంటారు. గ్రామస్తులు సైతం మద్యం కోసం మండల కేంద్రానికో, పట్టాణానికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే బెల్ట్ షాపుల కోసం ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలిసింది.

కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులపై నియంత్రణ..

నిజానికి ఒక గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉండాలి? అనే నిబంధనను ఎక్సయిజ్ శాఖ విధించలేదు. కానీ చాలా గ్రామాలు విచ్చలవిడిగా షాపులు నిర్వహించడాన్ని చెక్ పెట్టేందుకు స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. ఒకటి లేదా రెండు షాపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సొంతంగా రూల్స్ పెట్టుకున్నాయి. దీంతో అనుమతి తీసుకున్న షాపులు ప్రతి ఏటా కొంత మొత్తాన్ని గ్రామ పంచాయతీకి ఫీజు రూపంలో చెల్లించాలి. ఒకవేళ అనుమతి లేని షాపుల్లో మద్యం విక్రయిస్తే ఎక్సయిజ్ శాఖకు ఫిర్యాదు చేసి, కేసులు నమోదు చేయిస్తుంటారు. ప్రస్తుతం ఆ షాపులను దక్కించుకునేందుకే స్థానిక లీడర్లు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

ఎన్నికల వేళ పెరుగుతున్న పోటీ..

బెల్ట్ షాపులపై అటు పోలీసు, ఇటు ఎక్సైజ్ శాఖల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే బెల్ట్ షాపులను నియంత్రించేందుకు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేదు. ఆ షాపుల నిర్వహణ వల్ల సర్కారుకు ఆదాయం సమకూరుతోందనే అభిప్రాయంలో ఉన్న అధికారులు పరోక్షంగా వాటిని నిర్వహించేందుకు ప్రొత్సహిస్తున్నారు. అలాగే రూలింగ్ పార్టీ లీడర్లు సైతం తమ సన్నిహితులకు మాత్రమే బెల్ట్ షాపులు ఇవ్వాలని అటు గ్రామపెద్దలకు, ఇటు ఎక్సయిజ్ అధికారులకు సంకేతాలు ఇస్తున్నారు. దీనితో తమ పార్టీ కేడర్‌కు ఏదో ఒక ఫేవర్ చేశామని సంతృప్తి పడుతున్నారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో బెల్ట్ షాపుల ద్వారా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించవచ్చనే ఆశతో గ్రామస్థాయి లీడర్లు షాపుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story