త్వరలో అర్హులకు పదవులు

by Ajay Maddhiboyina |

పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

త్వరలో అర్హులకు పదవులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన గురువారం ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి గాంధీ భవన్‌లో వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలో సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతుంది. ఈ పాలనలో ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవలసిన అవసరం ఉందని సూచించారు. పార్టీలో కమిటీలు వేయడంలో ఆలస్యం అయిందని, దీంతో కార్యకర్తలు అసంత్రుప్తితో ఉన్నారని అన్నారు. త్వరలోనే అర్హతల ప్రకారం పదవులు దక్కుతాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేలపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.

చురుకైన నాయకుల్ని పీసీసీ అబ్జర్వర్లతో గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పిస్తారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేతలు, కార్యకర్తలపైనే ఉందని గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో అనుసంధానంగా పని చేయాలన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి నాయకులు వారధిగా పనిచేయాలని, సీనియర్, జూనియర్ల సమన్వయంతో పని చేయాల సూచించారు. కులసర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, భూ భారతి పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలతగా మలచుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేంపల్లి నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Next Story