T Congress: కలుపు మొక్కలు ఉంటే ఉండవచ్చు.. సంపత్ కుమార్ కలుపు మొక్కల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రియాక్షన్

by Prasad Jukanti |

T Congress: కలుపు మొక్కలు ఉంటే ఉండవచ్చు.. సంపత్ కుమార్ కలుపు మొక్కల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలను ఏరివేయాలంటూ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar) స్పందించారు. సంపత్ కుమార్ లేవనెత్తిన అంశాలను తప్పనిసరిగా పరిశీలిస్తామన్నారు. ప్రతి పార్టీలోనూ ఇలాంటి కలుపు మొక్కలు ఉంటే ఉండవచ్చునని, మా పార్టీలో కూడా అలాంటి కలుపు మొక్కలు ఉన్నట్లు మా నోటీసుకు వస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కలుపు మొక్కలు పేర్లను సంపత్ కుమార్ ఇస్తే వాటిపై విచారిస్తామన్నారు. ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీ పాత, కొత్తల కలయిక అని పాత నేతలకు ఉండే ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. పాతనేతలకు ప్రాముఖ్యత ఇస్తూనే కొత్తవారికి అవకాశాలు ఇస్తామనిచెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో వివిధ బాధ్యతల్లో ఉన్నవారి పనితీరును బేరీజు వేసి ప్రక్షాళన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పార్టీలో అక్కడక్కడా కలుపు, గంజాయి మొక్కలు కనపడుతున్నాయని వాటిని ఏరిపారేసి పచ్చని పంటలాగా ఉన్నకాంగ్రెస్ ను రాబోయే ఎన్నికలకు ఇసద్ధం చేయాలని నిన్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సంపత్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై ఇవాళ పీసీసీ చీఫ్ స్పందించారు.

డీసీసీ ఎంపిక ఇక అధిష్టానం చేతుల్లోనే:

డీసీసీల ఎంపిక విషయంలో తమ పరిధిలోని అంశాలన్ని పూర్తయ్యాయని మా అభిప్రాయాలను, ఆలోచనలను అధిష్టానం సేకరించిందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉందని ఆ నిర్ణయం ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడినా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తానికి మద్దతు ఇచ్చారు కదా అని అన్నారు. బిహార్ లో ప్రజల అభీష్టం, ఆశయాల మేరకు ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాలేదని మహేశ్ కుమార్ ఆరోపించారు. బిహార్ లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కంటే ఎస్ఐఆర్ పేరుతో తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువ ఉందని ఆరోపించారు. బిహార్ లో నితీశ్ కుమార్ హయాంలో జరిగిన అభివృద్ధి చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. బిహార్ లో ఓటు చోరీతో ఎన్డీయే గెలిచిందని ఇది గెలుపు కాదని ఆరోపించారు.

సౌది మృతులకు సంతాపం:

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్‌ వాసులు మృతిచెందడం పట్ల మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని బాధితకుటుంబాలను పరామర్శిస్తామన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదిస్తోందన్నారు.

Next Story