కుటుంబ వివాదాలతో కేసీఆర్ సతమతం: మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-28 11:18:20  IST  )

దేశ స్వాతంత్ర్య పోరాటం నుండి నేటి వరకు సేవదళ్ అప్రతిహతంగా తన సేవలను కొనసాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.

కుటుంబ వివాదాలతో కేసీఆర్ సతమతం: మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ స్వాతంత్ర్య పోరాటం నుండి నేటి వరకు సేవదళ్ అప్రతిహతంగా తన సేవలను కొనసాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. గాంధీ భవన్‌లో జరిగిన సేవదళ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సేవదళ్ ఎండగడుతుందని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలోని స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ విలువల రక్షణకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, నేడు తన కూతురు కవిత అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.

కుటుంబ వివాదాల్లో కేసీఆర్..

ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం సొంత వివాదాలతో సతమతమవుతోందని, వారు ప్రజల సమస్యల గురించి కాకుండా కేవలం పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్‌ను ఆదరించిన ప్రజలు, ఇప్పుడు ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఈ ఘనత (క్రెడిట్) అంతా సోనియా గాంధీ‌కే దక్కుతుందని ఆయన పునరుద్ఘాటించారు. "తెలంగాణ కోసం సోనియా గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ తన పాలనతో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారు" అని మండిపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story