- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండొద్దు: కవితకు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. కవితకు రాజకీయంగా అభినందనలు తెలుపుతూనే, గత పదేళ్ల పరిణామాలపై ఆమెను నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీలో కవితకు కూడా సమాన భాగస్వామ్యం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. "బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే కవిత గారు మౌనంగా ఉండి ఆ అక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు కేవలం బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు కానీ, ఆ దోపిడీలో తన పాత్ర ఏమిటో ప్రజలకు వివరణ ఇవ్వడం లేదు" అని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు చేరాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. "పదేళ్ల పాటు అదే పార్టీలో కొనసాగిన కవితకు అప్పుడు ఆ గుంటనక్కల విషయం తెలియదా? అధికారం పోయాక, ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఆశ ఉండాలి కానీ, ఇలాంటి అత్యాశ పనికిరాదు" అని హితవు పలికారు.
రేవంత్ రెడ్డిపై ఆరోపణలు అర్థరహితం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని, ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మరోసారి జయకేతనం ఎగురవేస్తుందని ఆయన స్పష్టం చేశారు.






