- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేసినా.. మున్సిపల్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రజలు వాటిని నమ్మకుండా అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందజేసి, ప్రజా పాలన ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మున్సిపాలిటీలు, మెజార్టీ కార్పొరేషన్లు, 1300 కు పైగా వార్డులు, 154 కు పైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలు తమ మద్దతును స్పష్టంగా వెల్లడించారన్నారు. శుక్రవారం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారదర్శక పాలన అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. సామాన్యుల సంక్షేమం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ లక్ష్య సాధనకు ప్రజలు మరోసారి ఆశీర్వాదం అందించారని తెలిపారు.
బాధ్యత మరింత పెరిగింది
వరుస విజయాలతో పార్టీపై రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు అత్యంత ప్రాధాన్యమని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రజలు వాటిని నమ్మకుండా అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేశారని ఆయన అన్నారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్ వంటి అంశాల్లో స్పష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత పారదర్శకంగా, ప్రజా కేంద్రంగా పాలన అందిస్తూ తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలపడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.






