TPCC: మీడియా ఆఫీస్‌పై దాడి.. వారిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్

by Ramesh Naini |   (  Updated:2025-06-28 11:19:29  IST  )

మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మేహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

TPCC: మీడియా ఆఫీస్‌పై దాడి.. వారిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మేహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మహాటీవీ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. పత్రిక విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. మీడియా ప్రసారాలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నాయని సూచించారు. మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం సహించ దగిన పరిణామం కాదని పేర్కొన్నారు. మీడియో ఆఫీస్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మహా న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ప్రముఖ నాయకులు తప్పుబట్టారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఖండించారు.

Read More.. ‘ఆ ఘటన పై చర్యలు తీసుకోవాలి’.. తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

Next Story