- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో కుంభవృష్టి.. 2.20 లక్షల ఎకరాల పంట నష్టం!
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పెద్దఎత్తున ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పెద్దఎత్తున ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. ఒక్కో శాఖకు రూ.వందల కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా సమాచారం. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండే శాఖలకు నష్టం పెద్ద ఎత్తున వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా వర్షాలు కురవడంతో పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, వ్యవసాయ, విద్యుత్, మహిళా శిశు సంక్షేమ శాఖ, నీటిపారుదల శాఖలకు అత్యధికంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. వర్షాలు తగ్గుముఖ పట్టడంతో అధికార యంత్రాంగం వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆయా శాఖల అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
వరికే అత్యధిక నష్టం..
వ్యవసాయ శాఖకు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయగా.. రాష్ట్రంలో 270 మండలాల పరిధిలో 2,463 గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టం సంభవించిందని వ్యవసాయ అంచనా వేసింది. మొత్తం 2,20,443 ఎకరాల్లో 1,43,304 మంది రైతులకు నష్టం జరిగినట్లుగా తెలిపారు. ఇందులో ఎక్కువగా వరి పంటకు నష్టం జరిగింది. 1,09,626 ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాల్లో పత్తి, 16 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 21 వేల ఎకరాల్లో సోయాబిన్, 639 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 7వేల ఎకరాల్లో పప్పుధాన్యాలకు నష్టం వాటిల్లగా... ఇందులో 6 వేల ఎకరాల్లో ఇసుక మేట వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఈ పంట నష్టంపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఒక ఎకరానికి గతంలో ఇచ్చినట్లుగా ఎకరానికి రూ.10 వేలు చెల్లిస్తే దాదాపుగా రూ.220 కోట్ల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు.
శాఖల వారీగా నష్టం వివరాలు..
ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.560 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.220 కోట్ల వరకు, పీఆర్ శాఖకు రూ.374 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడం, ఇంట్లో వస్తువులు పూర్తిగా తడిసిపోవడం.. వివిధ శాఖల కార్యాలయాలు, అంగన్వాడీ సెంటర్స్ పై కూడా వరద ప్రభావం పడింది. వీటన్నంటిని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోడ్లకు గండ్లు పడటంతో రాకపోకలు స్తంభించాయి. వాటిని పునరుద్ధరించాలంటే వరద తగ్గితే కానీ సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వరదలు అడ్డంకిగా మారడంతో అటు అధికారులు, ఇటు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున స్తంభాలు నెలకొరిగాయి. ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకపోయినట్లుగా గుర్తించారు. 33 కేవీ లైన్లు దెబ్బతిన్నట్లుగా తెలిసింది. అత్యధిక ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించినా.. ఇంకా మరికొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధిరించాల్సి ఉందని చెబుతున్నారు. శనివారం జరిగే కేబినెట్లో ప్రాథమిక అంచనాపై అధికారులు నివేదిక ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో నష్టం జరగడంతో ఆదుకోవాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక కేంద్రానికి దాన్ని పంపించి సాయం కోరే చాన్స్ ఉంది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది.
ఆర్అండ్‌బీ రోడ్లకు..
రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆర్అండ్‌బీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లకు నష్టం వాటిల్లింది. ఆర్‌అండ్‌బీ రోడ్ల శాశ్వత మరమ్మతులకు రూ.560 కోట్లు, తాత్కాలిక మరమ్మతులకు రూ.53 కోట్లు అవసరం అవుతాయని ఇంజినీర్లు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 784 ప్రాంతాల్లో 873 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. 39 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని, ఇందులో 10 పునరుద్ధరించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో శాశ్వత మరమ్మతులకు రూ.30 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.17 కోట్లు, కామారెడ్డిలో రూ.16కోట్లు, కరీంనగర్‌లో రూ.12కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.38 కోట్లు, సత్తుపల్లి డివిజన్లో రూ.30 కోట్లు, భద్రాచలంలో రూ.60 కోట్లు, కొత్తగూడెం జిల్లాలో రూ.45 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో రూ.51 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.41 కోట్లు, నారాయణపేట్ జిల్లాలో 22 కోట్లు, గద్వాల జిల్లాలో రూ.30 కోట్లు, వనపర్తి జిల్లాలో రూ.26 కోట్లు, నాగర్కర్నూలు జిల్లాలో రూ.33 కోట్లు రోడ్ల మరమ్మతులకు నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు.






