తెలంగాణ హోంమంత్రిగా చిరంజీవి లేదా నాగార్జున.. పేర్లు పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం?

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-10 04:32:59  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహాలను రచిస్తున్నది. అక్కడ గెలిచిన వ్యక్తికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ హోంమంత్రిగా చిరంజీవి లేదా నాగార్జున.. పేర్లు పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహాలను రచిస్తున్నది. అక్కడ గెలిచిన వ్యక్తికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. అభ్యర్థిని ప్రకటించే సమయంలోనే, జూబ్లీహిల్స్‌కు హోం మంత్రి పదవి ఇస్తామని పబ్లిక్‌గా ప్రకటించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలిసింది. దీనితో అక్కడ బరిలోకి దిగే లీడర్‌తో పాటు, స్థానిక క్యాడర్ గెలుపు కోసం సీరియస్‌గా పనిచేస్తారు. అదేసమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందని అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారు.

స్ట్రాంగ్ అభ్యర్థి కోసం అన్వేషణ

జూబ్లీహిల్స్‌లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి, సినిమా నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రస్ట్ చూపలేదని, హోం మంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చేతులు ఎత్తిస్తే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినిమా నటుడు నాగర్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆయన సైతం నో చెపితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటోన్న పలువురు పారిశ్రామిక వేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

‘హోం’ఆఫర్‌తో పాజిటివ్ ఒపీనియన్

ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్‌లో ప్రాతనిథ్యం లేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీగణేష్ విజయం సాధించారు. కానీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులు ఉండటంతో ఆయనకు ఛాన్స్ రాదు. గ్రేటర్ హైదరాబాద్‌కు మంత్రివర్గ ప్రక్షాళనలో మంత్రి పదవి ఇవ్వక తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి హోం మంత్రి ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే, ఎన్నికల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అదే సమయంలో స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేస్తారని అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారు. అయితే హోం మంత్రి పదవి ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉంది. భవిష్యత్‌లో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పుదు. అందుకని జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థికి ఇస్తామని ప్రకటిస్తే అన్ని ఇంటా, బయటా రాజకీయ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వ్యూహంలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తున్నది.

Next Story