జేఈఈలో సత్తా చాటిన TMREIS విద్యార్థులు

by Muthe.Rajitha |

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని సొసైటీ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి తెలిపారు.

జేఈఈలో సత్తా చాటిన TMREIS విద్యార్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని సొసైటీ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి తెలిపారు. సెకండియర్ లో టీఎంఆర్ఈఐఎస్ 88 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఫస్టియర్ లో 80 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెకండియర్ విద్యార్థుల్లో గద్వాల్ టిఎంఆర్జేసి కి చెందిన ముస్కాన్ బేగం 994 మార్కులు సాధించి రాష్ట్రంలో 4వ ర్యాంకు సాధించగా, ఫస్టియర్ లో ఖైరతాబాద్ టీఎంఆర్జేసీ బాయ్స్ కు చెందిన మొహద్ ఫర్హాన్ (సీఈసీ) 500 మార్కులకు గానూ 495, సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారని ఆయన అన్నారు. అదేవిధంగా, కొత్తగూడెం టీఎంఆర్జేసీ గర్ల్స్ కి చెందిన ఎస్కే. రంజాన్ బీ, బైపీసీలో 440 మార్కులకు గానూ 438, వజీహా తబస్సుమ్ బైపీసీలో 438 మార్కులతో రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఒకేషనల్ స్ట్రీమ్ లో వేములవాడ టీఎంఆర్జేసీ బాయ్స్ కు చెందిన యు. హేమంత్ (ఎంఎల్టీ) 500 మార్కులకు గానూ 496 మార్కులు సాధించి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు.

జేఈఈలో సత్తా చాటిన విద్యార్థులు:

ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో కూడా టీఎంఆర్ఈఐఎస్ విద్యార్థులు మంచి పర్సంటైల్ సాధించి ఉత్తీర్ణత సాధించారని ఖురేషి వెల్లడించారు. వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణలో భాగంగా, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులను జేఈఈ మెయిన్స్ 2025 కు సన్నద్ధం చేయగా, 35 మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. బాలురు, బాలికల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన చెప్పారు. అర్హత సాధించిన విద్యార్థులందరినీ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్, అకాడమిక్ టీమ్ కృషిని అభినందించారు.పేద మైనారిటీ విద్యార్థుల వృత్తి విద్యా అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీఎంఆర్ఈఐఎస్ ద్వారా జేఈఈ/ఐఐటీ, నీట్, ఈఏంసెట్, క్లాట్, సిఏ, సీపీటీ లాంటి అనేక ఇతర వృత్తి విద్యా కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

Next Story