తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్

by Malleboina Mahesh |

జూన్ 2లోగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. కొందరు మంత్రుల తొలగింపు, కొత్తవారి చేరికపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు.

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవతరణ దినోత్సవంలోపు మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. వీలైతే ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించి, ఆ స్థానాల్లో కొత్తవారిని తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ కొడుకు రిసెప్షన్‌కు అటెండ్ అయ్యేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి కేబినెట్ విస్తరణ, శాఖల మార్పు అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జూన్ 2లోపు కొత్త మంత్రులు కేబినెట్‌లోకి వస్తారని, లేకపోతే కొంత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కేరళ టాస్క్ క్లోజ్.. రాష్ట్రంపై ఫోకస్

ఇన్ని రోజులు కేరళంలో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బిజీగా ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయింది. సీఎంగా సతీశన్ ఈనెల 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమం పూర్తైన తర్వాత ఏఐసీసీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఒకేసారి భర్తీ చేయడమా? లేకపోతే ఒక స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసి, సమయం సందర్భం చూసుకుని మరొకటి భర్తీ చేయడమా? అనే కోణంలో కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. కాగా, శాఖల మార్పులు, ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించే విషయంపైనా అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదే సరైన సమయం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతుంది. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడం, మంత్రుల శాఖలను మార్చడం, పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టేయడానికి ఇదే సరైన సమయం అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. మరింత ఆలస్యం చేస్తే ఆ ప్రభావం త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడే ప్రమాదం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. అందుకని సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను ఎవరికి ఇవ్వాలి? మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలా? కేబినెట్‌లో ప్రాధాన్యత లేని బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలా? అని ఆరా తీస్తున్నట్లు సమాచారం.

అధిష్టానానికి విస్తరణ సవాళ్లు

ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. మంత్రి పదవి ఇస్తామని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనను కేబినెట్‌లోకి తీసుకుంటారా? మరి ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి కి ఇచ్చిన హామీని ఏ విధంగా పరిష్కరిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఆ వర్గానికి కేబినెట్‌లో ప్రయారిటీ లేదు. దీంతో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇస్తారా? అలా కాకుండా ఈ మధ్యే అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుడు పదవి ఇచ్చినందున అక్కడితో సర్దుకోవాలని ఆ వర్గానికి నచ్చజెప్తారా? అనే చర్చ జరుగుతున్నది. ఎస్టీ వర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. మరి విస్తరణలో ఆ వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా? లేదా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవిని అప్పగిస్తారా? హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ రెండు జిల్లాల నేతలను ఎలా సంతృప్తి పరుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

మంత్రుల తొలగింపు, శాఖల మార్పు తప్పదా?

కేబినెట్ విస్తరణ కంటే ముందు ఒకరిద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. సదరు మంత్రుల పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు రావడం కారణాలుగా చూపుతున్నారు. కేబినెట్ నుంచి తప్పించిన మంత్రుల స్థానంలో ఆదే సామాజిక వర్గానికి చెందిన నేతలను మంత్రులుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మంత్రుల శాఖలను సైతం మార్చే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. కొందరు మంత్రులు శాఖలను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అధిష్టానం వద్ద ఆధారాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొందరు సీనియర్ మంత్రులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న శాఖలను తొలగించి కీలక శాఖలు ఇవ్వాలంటూ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది.

రేవంత్, ఉత్తమ్, భట్టితో సంప్రదింపులు

నేడు ఢిల్లీకి వెళ్తున్న సీఎం ఆదివారం వరకు అక్కడే ఉండే అవకాశం ఉంది. అటు నుంచి సోమవారం కేరళంలో జరిగే సీఎం ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతారని తెలిసింది. ఆదివారం ఏఐసీసీ నేతలతో అపాయింట్‌మెంట్ ఉన్నట్లు సమాచారం. ఆ టైంలోనే సమయంలోనే కేబినెట్ విస్తరణ, మంత్రుల తొలగింపు, శాఖల మార్పులపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో కీలకమైన మార్పులు కావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకోసం ఆ ఇద్దరిని వెంటనే ఢిల్లీకి పిలవడమో, లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత ముగ్గురితో కలిపి సమావేశం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

Next Story