టైగర్ సేఫ్టికి మానిటరింగ్ సెల్.. తెలంగాణ వన్యప్రాణి సంరక్షణలో కొత్త అధ్యాయం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ నాయ‌క‌త్వంలో హైదరాబాద్‌ అర‌ణ్యభవన్‌లో స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించింది.

టైగర్ సేఫ్టికి మానిటరింగ్ సెల్.. తెలంగాణ వన్యప్రాణి సంరక్షణలో కొత్త అధ్యాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ నాయ‌క‌త్వంలో హైదరాబాద్‌ అర‌ణ్యభవన్‌లో స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించింది. ఈ చ‌ర్య పుల‌ల‌ను ప‌రిర‌క్షించడంతోపాటు పులులు, మ‌నుషుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ను కూడా త‌గ్గించ‌నున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ జిల్లాల వారీగా, విడివిడిగా పులుల కదలికలను గమనిస్తుండగా, తెలంగాణ మాత్రం మొత్తం రాష్ట్రాన్ని కవరుచేసే కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం స‌ర్వ్ర‌తా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. ఇలాంటి సాంకేతిక వ్యవస్థలు ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో మాత్రమే అమల్లో ఉన్నాయని అట‌వీ అధికారులు చెబుతున్నారు.

టైగ‌ర్ సెల్ ఎందుకు?...

సాధారణంగా వన్యప్రాణి విభాగాలు తమ తమ పరిధుల్లోనే ప‌ని చేస్తుంటాయి. కానీ, తెలంగాణ నూతన టైగర్ సెల్ ఇందుకు వినూత్నంగా పనిచేయనుంది. ఈ విభాగం నిత్యం పులులు, చిరుత పులుల కదలికలను పర్యవేక్షించ‌నున్న‌ది. దాంతోపాటు, పులులు, పులుల మ‌ధ్య ఘర్షణ ప్రాంతాలు, మ‌నుషులు, పులుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ప్రాంతాల‌ను గుర్తించి నిత్యం నిఘా ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు, ఆ ప్రాంతాన్ని అనునిత్యం అంచనా వేస్తూ మ్యాపింగ్ చేయనున్నారు. అడవిలో ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నారు. యాంటీ-పోచింగ్, రెస్క్యూ బృందాల తక్షణ పాట్రోలింగ్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇవ‌న్నీ స‌మ‌గ్రంగా ఒకే చోట నిర్వహించే వ్య‌వ‌స్థ ఈ టెగ‌ల్ సెల్ చేస్తుందని అధికారులు చెబుతన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రీకృత వ్యవస్థ భారతదేశంలో చాలా అరుదుగా ఉంటుందని అధికారులు తెలిపారు.

పులుల‌ కారిడార్లలో టైగ‌ర్ సెల్ ఎలా ఉప‌యోగం?

రాష్ట్రంలోని కవ్వాల్, ఏటూరు నాగారం, కిన్నెరసాని, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని పులుల కదలికలు సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. వీటితో పాటు మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్–ఉత్తర తెలంగాణ అడవులను ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాలతో కలిపే ఈ మార్గం దేశవ్యాప్తంగా టైగ‌ర్ కారిడార్‌గా గుర్తించి ఆ ప్రాంతాల్లో నిఘా ఉంచ‌నున్నారు. అయితే, పొరుగు రాష్ట్రాల్లో సరైన పర్యవేక్షణ లేకపోయినా, తెలంగాణ మాత్రం నిరంతర మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేయడంతో స‌ర్వ‌త్రా ప్ర‌శంసలు వ్య‌క్తం అవుతున్న‌వి. పులుల సంచారం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్విక్ రియాక్షన్ టీమ్స్ పై ఈ సెల్‌కు ప్రత్యక్ష నియంత్రణ ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల్లో సాంప్రదాయ పద్ధతిలో జిల్లాల అనుమతులతో ఆలస్యం జ‌రుగుతుంది. తెలంగాణలో మాత్రం టైగ‌ర్ కమాండ్ సెంటర్ నుంచే నేరుగా టీంల‌ను పంపే విధానాన్ని అవ‌లంభించనున్నారు. పులులు గ్రామాల వద్ద కనిపించినా, వేట ముఠాల కదలికలు ఉన్నా, పశువులపై దాడులు జరిగినా, గాయపడిన పులులకు చికిత్స అవసరమైనా - స్పందన మరింత వేగంగా అందేలా వ్యవస్థ రూపొందించనున్నారు.

శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో పులుల సంరక్షణ..

టైగర్లపై రేడియో కాలర్ అమర్చే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రారంభించేందుకు సిద్ధమైంద‌ని అట‌వీ అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ విధానాన్ని ఎక్కువగా వాడుతుండగా, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ ఆథారిటీ(ఎన్టీసీఏ) అనుమతి లభించిన వెంటనే తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఈ డేటా మొత్తం టైగర్ సెల్ నుంచే సేకరించి విశ్లేషించబడుతుంది. దాంతోపాటు, జాతీయ టైగర్ లెక్కల్లో తెలంగాణకు అదనపు ప్రయోజనం ల‌భించ‌నుంది.దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ)లో తెలంగాణకు నూతన సెల్ ఎంతో సహకరించనుంది. కేవలం రిజర్వుల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పులుల కదలిక పెరుగుతున్న వేళ, ఈ సెల్ కీల‌కంగా మార‌నుంది. భారతదేశంలో పులుల సంరక్షణకు సమన్వయం, సాంకేతిక నిఘా, వేగవంతమైన ఫీల్డ్ స్పందన వంటి అంశాలను పర్యవేక్షించడానికి తెలంగాణ టైగర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెల్ కీలక పాత్ర పోషించనున్నదని అధికారులు చెబుతున్నారు.

అడ‌వులు, అడ‌వుల్లో వ‌న్య‌ప్రాణుల‌ను సంర‌క్షించడ‌మే మా ఎజెండా

అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ‌…

అడ‌వులు, అడ‌వుల్లో వ‌న్య ప్రాణులను సంర‌క్షించ‌డ‌మే మా ప్ర‌జా ప్ర‌భుత్వం ఎజెండా అని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వన్య ప్రాణులు, ఇతర జీవుల మనుగడ మీద మన ఉనికి ఆధారపడి ఉందనే విషయం మ‌నం నిత్యం గుర్తుంచుకోవాలన్నారు. పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో మనుషులు, వన్య ప్రాణుల మధ్య తరుచూ జరిగే సంఘరణ్షలు, దాడుల్లో ఎంతో మంది మరణించారని తెలిపారు. కొన్ని క్రూర జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో… మనుషుల భద్రత, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 2019లోనే పలు కీలక సూచనలు చేసింద‌న్నారు. వాటిని ఆధారంగా తాము ముందుకు వెళుతున్న‌ట్టు వివ‌రించారు.

Next Story