ఆశావహులకు షాక్.. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారు అనర్హులు.

ఆశావహులకు షాక్.. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారు అనర్హులు. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసే వారిలో కొందరికి ముగ్గురు పిల్లలు ఉండటంతో వారందరు ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. గతంలో ఈ చట్టానికి సవరణ చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశారు. అయితే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఇక నిబంధనను తొలగించడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముగ్గురు అంత కంటే ఎక్కువ మంది పిల్లులు ఉన్న వారు పోటీ చేయడానికి అనర్హులే. జనాభా నియంత్రణ, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకవచ్చింది. నాటి నుంచి నేటి వరకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిబంధన కొనసాగుతోంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నిబంధనను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తొలగించింది. అయితే గ్రామీణ ప్రాంతంలో మాత్రం కొనసాగించారు. 1995 మే 31 కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. కానీ 1995 జూన్ 1 నుంచి ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు అనర్హులు. ఈ అంశానికి సంబంధించి సవరణ చేయాలని అనుకున్నా... చివరి నిమిషంలో ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

చట్టంలో మినహాయింపులు, షరతులు

మొదట కాన్పులో ఒకరు పుట్టి రెండో కాన్పులో ఇద్దరు పుడితే పోటీకి అర్హులే. ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండి ఆమె చనిపోతే ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్లు అయితే ఆమెకు మరొక సంతానం కలిగితే భర్త ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. కానీ ఆమెకు ఒకరే సంతానం కాబట్టి ఆమె పోటీ చేయడానికి అర్హురాలు. బతికి ఉన్న పిల్లలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి ముగ్గురు పిల్లలుండి అందులో ఒకరు చనిపోతే ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే. మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండి నామినేషన్ల పరిశీలన నాటికి ఆమె గర్బవతి అయి ఉంటే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హురాలేనని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేస్తోంది.

నియమ, నిబంధనలు..

- ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం 21ఏళ్ల వయస్సు ఉండాలి.

- ఎంపీటీసీగా పోటీ చేయడానికి ఆ మండలంలోని ఏ గ్రామంలోనైనా తప్పనిసరిగా ఓటరు అయి ఉండాలి. జెడ్పీటీసీగా పోటీ చేయడానికి పోటీ చేసే జిల్లాలో తప్పనిసరిగా ఓటరై ఉండాల్సిందే.

- ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఓటరై ఉండాలి. జెడ్పీటీసీని ప్రతిపాదించే వ్యక్తి పోటీ చేసే మండలానికి సంబంధించిన ఓటరై ఉండాలి.

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, స్థానిక సంస్థల ఉద్యోగి అయి ఉన్నా.. ఎన్నికల్లో నామినేషన్ వేయవచ్చు. అయితే నామినేషన్ పరిశీలన నాటికి ఆ ఉద్యోగానికి రాజీనామా ఆమోదించినట్లుగా ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.

- రేషన్ షాపు డీలర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

- అంగన్ వాడీ వర్కర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు. 2007లో ఉమ్మడి ఏపీ హైకోర్టు అనర్హులని తీర్పు ఇచ్చింది.

- సహకార సంఘాల ఆఫీసు బెరర్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

- ట్రస్ట్ బోర్డు, చారిటబుల్ సభ్యులు, చైర్మన్, మత సంస్థల్లో సభ్యులు పోటీ చేయడానికి అనర్హులు.

- ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే ఈ సంస్థల్లో పని చేసే మేనేజింగ్ ఏజెంట్, కంపెనీ కార్యదర్శి లు మాత్రం పోటీ చేయడానికి అనర్హులు.

- ఒక వ్యక్తి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు వేయవచ్చు.

- నామినేషన్ వేసి వ్యక్తి తన నామినేషన్ ను ఉపసంహరించుకోవచ్చు. లేదా అతను నియమించుకున్న ఏజెంట్ లేదా ప్రతిపాదించిన వ్యక్తి కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.

- బ్యాలెట్ పేపర్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్ట్రర్డ్ సింబల్ రిజర్వ్ అయిన పార్టీలు, సింబల్ లేని రిజిష్టర్డ్ పార్టీలు, చివరిగా ఇండిపెడెంట్లు ఉంటారు.

- జెడ్పీటీసీగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2500లు, ఇతరులు రూ.5వేలు, ఎంపీటీసీలుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1250, ఇతరులు రూ.2500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

- రిటర్నింగ్ ఆఫీసర్ ఒక వ్యక్తి నామినేషన్ ఆమోదించడంపై ఎలాంటి అప్పీలు చేయడానికి పీఆర్ చట్టం అనుమతించదు. ఒక వేళ నామినేషన్ ను తిరస్కరిస్తే ఆ వ్యక్తి ఆర్డీవో లేదా కలెక్టర్ స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చు.

- ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి గ్రామంలో, పట్టణంలో రెండు చోట్ల ఓటు ఉన్నా.. పోటీ చేయవచ్చు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించడానికి ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదు.

Next Story