- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్టెప్’ రూల్స్ బేఖాతరు..! ఆ శాఖలో ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం, యూత్సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ (టీజీ ఎస్‌టీఈపీ) విభాగంలో ఇద్దరు అధికారులకు అర్హత లేకపోయినా ఉన్నత పోస్టులు అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం, యూత్సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ (టీజీ ఎస్‌టీఈపీ) విభాగంలో ఇద్దరు అధికారులకు అర్హత లేకపోయినా ఉన్నత పోస్టులు అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు ఉద్యోగులకు గెజిటెడ్ అర్హత లేకున్నా ఆ హోదాను అనుభవిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరిలో ఒకరు టూరిజం శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తుండగా మరొకరు సెట్విన్ సంస్థలో ఉన్నారు. వీరిద్దరూ స్టెప్సంస్థ నుంచి ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై వెళ్లి సుమారు ఏడేళ్లకు పైగా అవుతున్నది. అయినా ఇంతవరకు వారు మాత్రం వెనక్కి రాలేదు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్లు డిప్యూటేషన్‌పై వెళ్లినప్పుడు ఆ తర్వాత మాతృశాఖకు రావాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పట్టింపులేని విధంగా ఇద్దరు ఉద్యోగుల తీరు వివాదాస్పదంగా మారింది.
గెజిటెడ్ అర్హత లేకున్నా.. ఆ హోదాలో
ఆ ఇద్దరిలో ఒక ఉద్యోగి స్టెప్నుంచి టూరిజంలో పనిచేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేశారు. ఇలా తమ మాతృశాఖల నుంచి ఇతర శాఖలకు వెళ్లి ఏడేళ్లు అవుతున్నా.. సొంత శాఖలకు తిరిగి రాకుండా ఇతర శాఖల్లో డిప్యూటేషన్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవేళ మళ్లీ డిప్యూటేషన్‌పై వెళ్లాలనుకున్నా ఐదేళ్ల తర్వాత వచ్చి రిపోర్ట్‌చేసి.. కొన్ని రోజులు ఉద్యోగం చేసి తిరిగి వెళ్లొచ్చు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా ఇతర శాఖల్లో డిప్యూటేషన్ల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. వారికి గెజిటెడ్అర్హత లేకున్నా.. ఆ హోదాను అనుభవిస్తున్నారు. సొసైటీలో పనిచేసే వారికి పరిమితులను కాలరాసి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్టెప్ అనేది సొసైటీ ద్వారా ఏర్పడిన సంస్థ.. ఇక్కడ అపాయింట్ అయిన ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ వీరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో చెలామణి అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. స్టెప్‌పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని సంస్థ ఉద్యోగులు ఆక్షేస్తున్నారు.
ఇంకా స్మితా సబర్వాల్ పేరు..!
తెలంగాణ సొసైటీ ఫర్ట్రైనింగ్అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ (టీజీఎస్టీఈపీ)కి చైర్‌పర్సన్‌గా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. యువజన సర్వీసులు చూసే అధికారి దీనికి చైర్ పర్సన్‌గా వ్యహరిస్తుంటారు. ఈ సంస్థకు గతంలో యువజన సర్వీసుల శాఖ బాధ్యతలను చూసిన స్మితాసబర్వాల్‌ను నియమించారు. అయితే ఆమె సెలవుపై వెళ్లి రెండు నెలలకు పైగా అవుతున్నది. కానీ టీజీఎస్టీఈపీ వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ ఆమె చైర్‌పర్సన్‌గా ఉన్నట్లు పొందుపరిచారు. వెబ్‌సైట్ల నిర్వహణలోనూ అధికారుల పనితీరు, వారి సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీ కాలంలోనూ అప్‌డేట్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పెద్దగా ఫోకస్లేని, ప్రాధాన్యం లేని సొసైటీల పనితీరు ఇలాగే ఉంటుందని విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సమీక్షలు, సమావేశాలు ఉండకపోవడంతో ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వ్యవహారం ఆడిందే ఆటగా కొనసాగుతున్నది. ఈ సంస్థల్లో కార్యకలాపాలు, డిప్యూటేషన్లను పట్టించుకోకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంస్థలపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు దృష్టిపెడితేనే దారినపడే అవకాశాలు ఉన్నాయి.






