కాంగ్రెస్ ప్రభుత్వ ఇబ్బందులను తట్టుకున్నోళ్లకు ఈ ఎండలెంత..! మాజీమంత్రి హాట్ కామెంట్స్

by Ramesh Goud |

కాంగ్రెస్ ప్రభుత్వ ఇబ్బందులను తట్టుకున్న వాళ్లకు ఈ ఎండలు ఏ మాత్రం అని, కాంగ్రెస్ మీద కోపంతోనే రైతులు బండ్లు కట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS Leader Jagadeesh Reddy) అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఇబ్బందులను తట్టుకున్నోళ్లకు ఈ ఎండలెంత..! మాజీమంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ ఇబ్బందులను తట్టుకున్న వాళ్లకు ఈ ఎండలు ఏ మాత్రం అని, కాంగ్రెస్ మీద కోపంతోనే రైతులు బండ్లు కట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS Leader Jagadeesh Reddy) అన్నారు. వరంగల్ జిల్లా (Warangal District) ఎల్కతుర్తి (Elkathurthi)లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver jubilee Meeting)కు సూర్యాపేట జిల్లా నుంచి రైతులు ఎండ్ల బండ్ల మీద బయలుదేరారు. సభకు బయలుదేరుతున్న ఈ ఎడ్లబండ్లను మంగళవారం జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ (BRS President KCR) సారధ్యంలో జరుగనున్న 25 ఏండ్ల BRS పండుగ.. భారీ బహిరంగ సభకు సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా వుందని అన్నారు.

బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేస్తున్నారని తెలిపారు. రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారని, నీడలో ఉన్న వాళ్ళం ఎండనబడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై కోపంగా ఉన్నారని చెప్పారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని, అటువంటి దేవుడు లాంటి కేసీఆర్ ని వదులుకున్నామన్న బాధలో ప్రజలంతా ఉన్నారని అన్నారు. అందుకే కేసిఆర్ మీద అభిమానంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయలుదేరారని చెప్పుకొచ్చారు. ప్రజలంతా హాజరై ఈసభను కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేక సభలాగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారని అన్నారు.

గత పది రోజులు క్రితం రైతులు కలిసి ఎడ్లబండ్లపై వెళ్తామంటే.. 130 కిలోమీటర్ల మేర ఈ ఎండలో వెళ్లడం సాధ్యమైద్దా అన్నానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకున్నోళ్లం.. ఈ ఎండలను తట్టుకోవడం లెక్క కాదని రైతులు దీమాగా చెప్పారని తెలిపారు. ఇక సభ సమయానికి చేరుకునేలా ముందుగా అనుకున్న ప్రకారం 5 రోజుల ముందుగా బయలుదేరారని, ఎల్కతుర్తి మట్టిని తాకి.. రజతోత్సవ సభను తిలకించి.. కేసీఆర్ మాటలు వినాలన్న రైతుల తపన ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. కేసిఆర్ పైన రైతాంగం చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతుందని, కొండంత అభిమానంతో పాటు సాహసోపేతమైన యాత్రగా ఈ ఎడ్లబండ్లలో వెళ్తున్న రైతులందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Next Story