నేడే ‘ఫైనల్’ ఫైట్.. రంగం సిద్ధం

by Naga Rani Yarlagadda |

ప్రచారం ముగిసింది పోరు మిగిలే ఉంది. రాష్ట్రంలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

నేడే ‘ఫైనల్’ ఫైట్.. రంగం సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రచారం ముగిసింది పోరు మిగిలే ఉంది. రాష్ట్రంలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల పరిధిలోని 3,752 పంచాయతీల సర్పంచ్ లకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్​మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్​విడుదల చేసిన ఎన్నికల సంఘం బుధవారం మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచ్​పదవులకు 12,652 మంది అభ్యర్థులు, 28,410 వార్డు సభ్యులకు 75,725 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారిని ఎన్నుకోవడానికి 53,06,401 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 140 మంది ఉన్నారు. వీరి కోసం 36,483 పోలింగ్​కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో విడతలో ఇప్పటికే 394 మంది సర్పంచ్​లు, 7,908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 సర్పంచ్​స్థానాలకు ఒక్కరూ సైతం నామినేషన్​దాఖలు చేయలేదు. 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్​కూడా దాఖలు కాలేదు.

గ్రామాలను చుట్టేసిన నేతలు

మూడో విడత ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించగా వారికి మద్దతుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు గ్రామాలు, వాడలను కలియతిరిగారు. అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించడం, హామీలు ఇస్తూ, పార్టీల్లో చేరే విధంగా ప్రచారం చేశారు. మద్యం, డబ్బు, చీరలు, ఇతర వస్తుసామగ్రిని పెద్దఎత్తున పంపిణీ చేశారు.

డబ్బు, మద్యం సీజ్

ఎన్నికల కోడ్​లో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు రూ.9.11 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వాటిని పట్టుకున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండటానికి గతంలో నేర చరిత్ర ఉన్న 36,165 మందిని బైండోవర్​చేశారు. 912 ఆయుధాలను వెనక్కి తీసుకున్నారు. రూ.2.09కోట్ల నగదును పట్టుకోగా, రూ.3.81 కోట్ల మద్యాన్ని సీజ్ చేశారు. రూ.2.28కోట్ల విలువైన డ్రగ్స్, రూ.90లక్షల విలువైన వస్తువులు, ఇతర వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Next Story