అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

by Bhoopathi Nagaiah |

భూమి అనేది సెంటిమెంట్, దానిని ఎంత ముందుకు తీసుకుపోతే అంత మంచిది. అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని క్రెడాయ్ ద్వారా వాటన్నింటిని పటాపంచలు చేస్తామని రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, శేరిలింగంపల్లి : భూమి అనేది సెంటిమెంట్, దానిని ఎంత ముందుకు తీసుకుపోతే అంత మంచిది. అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని క్రెడాయ్ ద్వారా వాటన్నింటిని పటాపంచలు చేస్తామని రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రెడాయ్ 2025 ప్రాపర్టీ షోకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఆయన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, కానీ కొందరు అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు అనుమానాలు, అపోహలు సర్వ సాధారణం అని అన్నారు. ఫ్యూచర్ సిటీ అంటే ఫోర్ బ్రదర్ సిటీ అని కొందరు ఆరోపణలు చేస్తుంటారు. అభివృద్ధి రెండు రకాలుగా ఉంటుందని, పాలసీ మ్యాటర్స్, డెవలప్మెంట్, నూతన నిర్మాణాలు, పారదర్శకమైన విధానాలు, ప్రజలకు అందుబాటులో ఉండాలనే తపనతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.

పెట్టుబడులను ఆకర్షించినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కులీకుతుబ్ షాల నుంచి వైఎస్ వరకు ఎందరో అభివృద్ధి సాధించారని, వారందరి కృషి వల్లనే మనం ముందుకు సాగుతున్నామన్నారు.నగరంలో హైటెక్స్ కు పునాది వేసింది రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిలు, దానిని కంటిన్యూ చేసింది చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధినే కోరుకుంటుందని, పెట్టుబడులను ఆకర్షించేందుకు, అన్ని రంగాలకు లాభాలు వచ్చేందుకు కృషి చేస్తామని, అది మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పొలిటికల్ పార్టీలకు సొంత ఎజెండా ఉంటుందని, రాజకీయాలలో ఒకే కుర్చీ కోసం పోటీ ఉండడం సహజమేనని, అది కుటుంబం అయినా కులం అయినా ఏదైనా ఒకటే అన్నారు. రాజకీయ పార్టీలు సృష్టించే అపోహలు ఉంటే వాటిని రియల్టర్లు, బిల్డర్లు తొలగించుకోవాలని ఇది నా రిక్వెస్ట్ అని, లేదంటే మీరే నష్ట పోతారని అన్నారు.

విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్న మేము మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించం.. అపోహలు సృష్టించే వారి మాటలను నమ్మితే మీరు ఇలాగే ఉంటారు. వారి మాటలు నమ్మకండి.. నష్ట పోకండి అని సలహా ఇచ్చారు. సీఎంగా ప్రతీ ఒక్కరిని నేను సంతోష పెట్టలేను. నేను మధ్య తరగతి ఆలోచనలు ఉన్నవాడిని, నాది పెట్టుబడిదారి మనస్తత్వం కాదు.. సగటు మధ్య తరగతి ఆలోచన ఉన్న సీఎంను అన్న ఆయన కొల్లగొట్టి విదేశాలకు తరలించాలని ఆలోచన ఉన్న సీఎంను కాదని అన్నారు. గతంలో సూపర్ లగ్జరీ సదుపాయాలు పొందిన వారు ఇబ్బందులు పడితే నేనేం చేయలేనని, ప్రజలకు ఉపయోగపడేది ఉంటే చెప్పండి దానికోసం కృషి చేస్తాం.. కానీ నాకూ పరిమితులు ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ సీఎంగా తగిన సదుపాయాలు కల్పించి ఉండక పోతే ఇవాళ హైదరాబాద్ ఇలా ఉండేది కాదని, అభివృద్ధి చేస్తే కొంతమందికైనా లబ్ధి చేకూరుతుందని గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వల్లనే మెట్రో వచ్చిందని, మెట్రో విస్తరణ లేకనే 10 ఏళ్లు వెనక్కి పోయామని, గత ప్రభుత్వం విస్తరించి ఉంటే ఇవాళ ట్రాఫిక్ జామ్ లు తప్పేవని అన్నారు.

మల్టీయుటీలిటీ ఉండేలా మెట్రో ఏర్పాట్లు ఉండాలన్న ఆయన మెట్రో రీ డిజైన్ చేస్తున్నామని బీహెచ్ ఈఎల్, పఠాన్ చెరు వరకు మెట్రో అవసరం ఉందని, మేడ్చల్, శామీర్పేట్ వరకు మెట్రో విస్తరిస్తున్నట్లు తెలిపారు. లాస్ట్ మెయిల్ కనెక్టువిటీ అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రతీసారి సీఎం ఢిల్లీకి పోయాడు అంటూ అర్రాస్ పాడినట్లు లెక్కలు వేస్తున్నారు. అనుమతులు ఎక్కడ లభిస్తాయో అక్కడికే వెళ్ళాలి. అలా కాదని నేను ఇంకో దగ్గరకు వెళితే అనుమతులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఢిల్లీలో సీఎంకు బంగ్లా ఎందుకు ఇచ్చారు..? దానిని ఫార్మ్ హౌస్ లాగా వాడుకోవాలని ఇవ్వలేదని, అనుమతుల విషయంలో ఢిల్లీకి వచ్చిన ప్రతీసారి ఉండాలని ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం కోసం లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. 12 సంవత్సరాల పరిమితికి అధిక ఇంట్రెస్ట్ కు అప్పులు తెచ్చి కుప్పలు పెట్టారని, ఇప్పటి వరకు రూ.32 వేల కోట్ల అప్పులు కట్టినట్లు తెలిపారు. రూపాయి పెట్టుబడితే 42 పైసలు వస్తున్నాయని, లాభాలు పక్కన పెడితే గతంలో తెచ్చిన అప్పులకు మిత్తులు కడుతున్నామన్నారు.

రూ. 26వేల కోట్లను 35 సంవత్సరాలకు చెల్లించేలా కేంద్రాన్ని ఒప్పించాంమని, అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు కావాలని ప్రధానిని అడిగామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 6,7 ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని, మహారాష్ట్రలో 40 ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని, కానీ తెలంగాణలో మాత్రం ఒకే ఒక ఎయిర్ పోర్ట్ ఉందని, 80వేల పుస్తకాలను చదివిన మేధావులకు ఈ విషయం తెలియదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించి ఆదిలాబాద్, వరంగల్ లో రెండు కొత్త ఎయిర్ పోర్టులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు.

మేధావులు ఎయిర్ పోర్ట్ లు వస్తే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందన్న ఆయన రీజినల్ రింగ్ రోడ్ తో పాటు రీజినల్ రింగ్ రోడ్డు తీసుకువస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్స్ కు కనెక్టివ్ రేడియల్ రోడ్లు వేస్తున్నామని, అలాగే శాటిలైట్ సిటీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి సమస్య వస్తే ప్రత్యామ్నాయంగా రింగ్ బండ్ కడుతున్నామన్నారు. పోర్ట్ లకు అనుసంధానం కోసం 8 లైన్ ఎక్స్ప్రెస్ హైవే ప్రతిపాదనలు సిద్ధం చేశామని,

విజన్ 2047తో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని, తెలంగాణ మ్యాప్ ముందు పెట్టుకుంటే అన్నీ అందులోనే కనిపిస్తాయని తెలిపారు. నాళాలు, చెరువులను మనమే ఆక్రమించామన్న ఆయన అవి ఉండే చోటికి మనం వెళ్తున్నాం అని, అవి మన దగ్గరకు వచ్చాయని అన్నారు. అందుకే హైడ్రా తీసుకువచ్చామని.. హైడ్రా వల్ల కొంతమందికి నష్టం వస్తుందని, యుద్ధం వస్తే సైనికులు మాత్రమే కాదు అమాయకులు కూడా చనిపోవడం సర్వ సాధారణం అని వివరించారు. నాలాలను అభివృద్ధి చేస్తుంటే డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దానిని మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు. దానివల్ల మీకే నష్టం అని రియల్టర్లను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. బతుకమ్మ కుంట, సున్నం చెరువు అభివృద్ధి వల్ల ప్రజలకే లాభం అని, మన నగరాన్ని గొప్ప నగరంగా మారుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఏది కట్టినా అది అక్కడే ఉంటుందని,

సంపాదించింది ఎవరైనా తీసుకుపోవచ్చు కానీ సమాజం కోసం సంపాదించింది ఎవరూ తీసుకుపోరని గుర్తు చేశారు. నేను చేసిన మంచి పనులు 1000 ఏళ్ల కాలం అందరికీ గుర్తు ఉండాలని, గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నాకు ఇక్కడి పరిస్థితులు తెలుసని అన్నారు. తెలివి తేటలకు, చిత్తశుద్ధికి సంబంధం లేదన్నారు. భాష వచ్చిన వాడు కూడా బాత్రూంలు కడుగుతున్నారు భాషకు, చిత్తశుద్ధికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని తెలిపారు. భూమి అనేది సెంటిమెంట్.. దానిని ఎంత ముందుకు తీసుకుపోతే అంత మంచిదన్నారు. అనుమతులతో పాటు లాభాలు చూపించే బాధ్యత నాదన్న ఆయన ఇక్కడ పెట్టుబడులు పెట్టి సమాజానికి ఉపయోగపడాలని క్రెడాయ్ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ అధ్యక్షుడు రామిరెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు జయదీప్ రెడ్డి, అనిల్ రెడ్డి, తెలంగాణ క్రెడాయ్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, జగన్నాథ్, ఇంద్రసేన్, జయేష్ రంజన్, ఇలంబర్తీ, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇతర క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story