ఈ తహసీల్దార్లు మాకొద్దు బాబోయ్! రోడ్డెక్కి రైతుల ధర్నాలు, నిరసనలు

by Kema Shiva Kumar |

అవినీతి, లంచగొండి అధికారులకు వ్యతిరేకంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు.

ఈ తహసీల్దార్లు మాకొద్దు బాబోయ్! రోడ్డెక్కి రైతుల ధర్నాలు, నిరసనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి, లంచగొండి అధికారులకు వ్యతిరేకంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఆ అధికారులు తమ మండలానికొద్దంటూ నిరసనలు తెలుపుతున్నారు. భూ సమస్యల పరిష్కారానికి లంచాలు అడుగుతున్నారంటూ కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ వాపోతున్నారు. అంతేకాకుండా లంచాలు తీసుకుంటూ ఇటీవల పలువురు ఏసీబీకి చిక్కారు. కాగా, గతంలో రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే అవినీతి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వరకు పాకినట్లు చర్చ జరుగుతున్నది. రైతులకు మెరుగైన, సత్వర సేవలందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రయత్నిస్తుండగా.. కొందరు అవినీతి అధికారుల వల్ల రెవెన్యూ శాఖ బద్నాం అవుతున్నదని అన్నదాతలు పేర్కొంటున్నారు.

అధికారులకు వ్యతిరేకంగా నిరసనలు

తమ భూములకు పట్టాలు మంజూరు చేయడంలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి తహశీల్దార్ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. అన్నదాతలకు న్యాయం చేయని తహశీల్దార్ వద్దంటూ నినాదాలు చేశారు. సర్వే నం.372, 373, 374 లో 115 మంది రైతులు 40 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారు. ఇందులో 20 ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చారు. ఆర్ఐ మోఖా మీదికి వచ్చి విచారణ జరిపారు. రిపోర్ట్ సమర్పించి ఏడాది గడుస్తున్నా.. పట్టాలు ఇవ్వడం లేదని, తహశీల్దార్‌ను కలిసి రిక్వెస్ట్ చేస్తే అవమానకరంగా మాట్లాడారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తహశీల్దార్ లంచాలు అడుగుతున్నారంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుటే ధర్నా చేశారు. విరాసత్ చేసే అంశంలో లంచం అడిగారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బులు డిమాండ్ చేయడంతో స్లాట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. తమ భూమిని తప్పుగా రికార్డు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తహశీల్దార్ వ్యవహారంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై జరిగిన దర్యాప్తులో భాగంగా గంగాధర సబ్ రిజిస్ట్రార్ అఫ్జల్ నూర్ ఖాన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి హవేలిలో సర్వే నం.272/14కి సంబంధించిన భూమిలో 9 క్రయవిక్రయాలు జరిగాయి. అయితే ఎస్ఆర్వో అఫ్జల్ నూర్ ఖాన్ ఈ రిజిస్ట్రేషన్లను గుర్తించి డాక్యుమెంట్లను రద్దు చేసేందుకు సిఫారసు చేశారు. అప్పటికే చట్ట విరుద్ధ చర్యల కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇది సర్కార్ భూమి కావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా వ్యవహరించారు. రెవెన్యూ అధికారులు లంచాలు అడుగుతున్నారని, తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ పలు జిల్లాల్లో కలెక్టర్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

ఏసీబీకి చిక్కి..

భూమి విలువను బట్టి రెవెన్యూ అధికారులు గుంటకు రూ.లక్ష వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలో ఈ దందా ఎక్కువగా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 14 గుంటల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వై.మదన్ మోహన్‌రెడ్డి రూ.8 లక్షల రేటు కట్టారు. ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణ 7 గుంటలకు రూ.9 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అక్రమాలను తట్టుకోలేని బాధిత రైతులు వారిని ఏసీబీకి పట్టించారు.

భయంతో లాంగ్ లీవ్!

హైదరాబాద్ నగర శివార్లలో కొందరు డిప్యూటీ తహశీల్దార్ల అవినీతి ముదిరింది. దీంతో బాధితుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఏ క్షణాన్నయినా తమను ఏసీబీకి పట్టించే అవకాశం ఉందని గుర్తించి కొందరు భయపడుతున్నారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా మ్యుటేషన్ చేసిన కేసు ఇటీవల వెలుగు చూడగా.. తనపై చర్యలకు అవకాశముందనే భయంతో ఓ రెవెన్యూ అధికారి లాంగ్ లీవ్ పెట్టినట్లు తెలిసింది. ఓ వైపు బహిరంగంగా లంచాలు, మరోవైపు భయంతో సెలవులు పెట్టడం రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏండ్లుగా పెండింగ్

మ్యుటేషన్ చేసేటప్పుడు ఓ వృద్ధ మహిళకు చెందిన ఇంటి పేరు రెవెన్యూ రికార్డుల్లో తప్పుగా నమోదైంది. ఇది ఆ వృద్ధురాలు చేసిన తప్పు కాదు. కానీ సరి చేయాలంటూ రెండేండ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఇప్పటికీ ఫైల్ పెండింగులోనే ఉన్నది. ఇలాంటి అప్లికేషన్లను ఉద్దేశ్యపూర్వకంగానే పెండింగ్ పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక రైతు తన భూమిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.10 లక్షలకు పైగానే రుణం తీసుకున్నారు. కానీ అదే భూమి మార్ట్‌గేజ్‌లో ఉండగానే మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్దార్లు కూడా ఉన్నారు. ఇలాంటి నిర్లక్ష్యం, అవినీతి అధికారులు కొందరే ఉన్నారు. కానీ వారితోనే రెవెన్యూ శాఖకు మాయని మచ్చగా మార్చేస్తున్నారు.

‘పెండింగ్’ ఉదాహరణలెన్నో!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నం.41/20ఆ1/2లో అల్మాస్ గూడకు చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి 15 గుంటల భూమిని 2019లో స్టాంప్ డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ చేయించుకున్నారు. అయితే కొనుగోలుకు ముందే 1954 నుంచి పహానీలను పరిశీలిస్తే ఆ సర్వే నంబరులోని భూమి పట్టాగానే ఉన్నది. ధరణి రికార్డుల్లోకి కూడా ఎక్కింది. కానీ ఇప్పుడు అది ఖాస్రాలో ప్రభుత్వం ఉందంటూ పీవోబీలో నమోదు చేశారు. మూడు సార్లు అప్లయ్ చేస్తే తహశీల్దార్ ఉన్నది ఉన్నట్లుగా రాసి రిపోర్ట్ పంపిస్తే.. అదనపు కలెక్టర్, కలెక్టర్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే 70 ఏండ్ల పహానీల్లో పట్టాగా ఉందని కొనుగోలు చేస్తే ఇప్పుడు శిక్షిస్తే ఎట్లా? ఇన్నాండ్లుగా ఎన్నో క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి అప్లయ్ చేయగా తాను వాస్తవాలను రిపోర్టులో పేర్కొంటున్నానని, ఉన్నతాధికారులు రిజెక్ట్ చేస్తే తానేం చేయాలంటూ చేతులెత్తేస్తున్నారు. ఇప్పుడైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం యరడపల్లిలో సర్వే నం.200/2లో 0.38 ఎకరాలను ఖారిజ్ ఖాతాగా నమోదు చేశారు. కానీ తరతరాలుగా అది పట్టాగానే ఉందని పహానీలు స్పష్టం చేస్తున్నాయి. ఇది పట్టాగా మార్చాలంటూ అప్లయ్ చేస్తే శంకరపట్నం తహశీల్దార్ మూడుసార్లు రిజెక్ట్ చేశారు. ఆఖరికి సీసీఎల్ఏ అధికారుల నుంచి ఫోన్ చేయించి ఖారిజ్ ఖాతా అంటే ప్రభుత్వ భూమి కాదని స్పష్టత ఇప్పించినా.. నెగెటివ్ రిపోర్టు రాశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సేత్వార్, ఖాస్రా పహానీ ప్రామాణికంగా పీవోబీ జాబితాను రూపొందించడం వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు.

గైడ్‌లైన్స్ జారీ చేయకపోతే..

ఐదారు దశాబ్దాల నుంచి పట్టాగా రికార్డుల్లో ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టారు. అప్లయ్ చేయగానే ఖాస్రా పహానీ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. మరి అప్పటి దాకా పట్టాగా రాయడం వల్లనే తాము కొనుగోలు చేశామన్న బాధితుల ప్రశ్నకు సమాధానం లేదు. ఇకనైనా ఇలాంటి అంశాలపై సీసీఎల్ఏ నుంచి సరైన గైడ్ లైన్స్ రావాలి. ఆర్వోఆర్-1971 ప్రకారం నేచర్ ఆఫ్ ల్యాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఖాస్రా పహానీని ప్రామాణికంగా ఆచరిస్తున్నారు. అదే కొన్ని జిల్లాల్లో మాత్రం 20, 30 ఏండ్ల నుంచి పట్టా ఉంటే పీవోబీ నుంచి తొలగిస్తున్నారు. కొందరు కలెక్టర్లు మాత్రం తమకు సీసీఎల్ఏ నుంచి ఆదేశాలే ప్రామాణికం అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. పీవోబీ, నేచర్ ఆఫ్ ల్యాండ్, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ వంటి సమస్యలకు సరైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరముంది.

Next Story