రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్​కొరత లేదు

by velandi.Saikiran |   (  Updated:2026-05-18 15:15:39  IST  )

పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్ డిమాండ్‌కు తగినంత అందుబాటులో ఉందని, ఎక్కడా కొరత లేదని రాష్ట్ర చమురు మార్కెటింగ్‌ కంపెనీలు స్పష్టం చేశాయి.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్​కొరత లేదు
X

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్​కొరత లేదు

వినియోగదారులకు త్వరగా సరఫరా చేసేందుకు రవాణ వేగవంతం

ఈనెలలో 20.06 లక్షల సిలిండర్లు పంపిణీ : చమురు మార్కెటింగ్​ కంపెనీలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్ (ఎల్బీజీ) డిమాండ్‌కు తగినంత అందుబాటులో ఉందని, ఎక్కడా కొరత లేదని రాష్ట్ర చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సోమవారం ఒక ప్రకటలో పేర్కొంటూ సరఫరాను ప్రభుత్వ రంగ ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెల్లడించారు. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్‌ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధిని ఓఎంసీలు నమోదు చేశాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఆందోళనతో వినియోగదారులు ముందస్తు బుకింగ్ చేయటం లేదు.

ఈ నెలలో 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేశామనీ, ఈ సీజన్‌కు ఇది సాధారణమని ఓఎంసీలు తెలిపాయి. ఎస్‌ఎంఎస్‌, మిస్డ్‌ కాల్‌, ఐవీఆర్‌ఎస్‌, ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఎల్పీజీ సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని ఎల్పీజీ వినియోగదారులను కంపెనీలు ప్రోత్సహించాయి. ఎల్పీజీ సిలిండర్ల విషయంలో అక్రమాలను అరికట్టేందుకు, అసలైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు ఓటీపీ ఆధారిత సిలిండర్ డెలివరీ విధానమైన డెలివరీ అథెంటికేషన్ కోడ్‌ (డీఏసీ) వ్యవస్థను అనుసరించాలని కోరాయి. తెలంగాణలో ప్రస్తుతం డీఏసీ విధానం 95 శాతానికి పైగా అమలవుతోంది. రాష్ట్రంలో డీఏసీ అమలు శాతాన్ని వంద శాతానికి చేర్చేందుకు ఓఎంసీలు, గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల సహకారం అందించాలని పేర్కొన్నారు. అబద్దపు వార్తలు, వదంతులను నమ్మి మోసపోవద్దని విశ్వసనీయ సంస్థలు అందించే సమాచారం మాత్రమే సామాన్య ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని ఓఎంసీలు విజ్ఞప్తి చేశాయి.

Next Story