- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నిధుల కొరత లేదు.. జీతాలు ఎందుకు పడలేదు?' అధికారులను నిలదీసిన సీఎం!
జులై 1న సగం మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : జులై 1న సగం మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలస్యానికి కారణమైన వివిధ శాఖల సెక్రెటరీలు, హెచ్ఓడీలకు మెమోలు ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సకాలంలో బిల్లులు సమర్పించని కారణంగానే ఉద్యోగులకు జీతాలు వేయలేదని ఆర్థిక శాఖ వర్గాలు సీఎంఓకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఆలస్యంగా బిల్లులు సమర్పించిన శాఖల వివరాలను సీఎంకు అందించినట్టు తెలిసింది. త్వరలో జరిగే సమీక్షా సమావేశంలో జీతాల చెల్లింపుపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగిన విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అంశంపై సమీక్ష జరిపేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇతర పనులు ఉండటంతో అది కాస్త వాయిదా పడింది. అంతకుముందు సీఎంఓ అధికారులతో జీతాల చెల్లింపు ఆలస్యం అంశం చర్చకు వచ్చిన సమయంలో సీఎం తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది.‘ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ప్రతినెలా ఒకటిన ఇవ్వాలి. నిధుల కొరత లేదు. అయినా ఎందుకు జీతాలు ఇవ్వలేదు’ అని సీఎం ప్రశ్నించగా.. నిర్ణిత సమయంలో బిల్లులు సమర్పించని కారణంగానే సగం మందికి మాత్రమే జీతాలు చెల్లించినట్టు అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీనితో సీరియస్ అయిన సీఎం నిర్ణీత సమయంలో బిల్లులు సమర్పించని సెక్రెటరీలు, హెచ్ఓడీలను గుర్తించి వారికి మెమోలు ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించినట్టు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ ఏశాఖ ఏరోజు శాలరీ బిల్స్‌ను ఆర్థికశాఖకు సమర్పించింది? సకాలంలో ఏ ఏ శాఖలు సమర్పించలేదు? అందుకు గల కారణాలు ఏంటీ? అనే అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
సీరియస్‌గా తీసుకోని అధికారులు
జులై ఒకటి నుంచి రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే ప్రతినెలా ఒకటో తేదీన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో జూన్ జీతాల బిల్లులను జూన్ 25 లోపు తమకు పంపాలంటూ ఆర్థికశాఖ అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేసింది. కానీ, కొన్ని శాఖలు మాత్రమే నిర్ణీత సమయంలో జీతాలకు సంబంధించిన బిల్లులను ఆర్థిక శాఖకు పంపాయి. దీంతో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో కేవలం 2.70 లక్షల మందికి మాత్రమే ఈ నెల ఒకటిన జీతాలు అందాయి.
నిర్లక్ష్యంలో సెక్రెటరీలు, హెచ్ఓడీలు
ప్రతినెలా ఒకటిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే 5 రోజుల ముందుగా జీతాల బిల్లులను ఆర్థిక శాఖకు పంపాలి. కానీ మెజారిటీ సెక్రెటరీలు,హెచ్ఓడీలు తమ శాఖల పరిధిలోని సంస్థలకు బిల్లులను సమర్పించే డెడ్‌లైన్ వివరాలను పంపలేదు. దీంతో సగం మందికి మాత్రమే జీతాలు సకాలంలో చెల్లించారు. మిగతా సగం మంది జీతాల బిల్లులను ఆర్థిక శాఖకు పంపలేదు. ఇప్పటివరకు కొన్ని శాఖలు తమ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బిల్లులను ఆర్థిక శాఖకు సమర్పించలేదు.






