ఆ పది మంది ఎమ్మెల్యేల్లో గుబులు.. బై పోల్‌లో గెలిచి నిలుస్తామా అన్న డౌట్!

by Kema Shiva Kumar |

ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది.

ఆ పది మంది ఎమ్మెల్యేల్లో గుబులు.. బై పోల్‌లో గెలిచి నిలుస్తామా అన్న డౌట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వారిలో టెన్షన్ మొదలైంది. అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ పై అక్టోబర్ చివరి నాటికి నిర్ణయం తీసుకోవాలని గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత వారిలో దిగులు మొదలైందనే ప్రచారం జరుగుతున్నది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ పై స్పీకర్ సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేలు అందుకు లిఖితపూర్వంకగా వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇరుపక్షాలను పిలిచి స్పీకర్ విచారణ ప్రక్రియ మాత్రం మొదలుపెట్టలేదు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా స్పీకర్ వెంటనే విచారణ మొదలుపెడతారా? లేదా? అన్నది ఆసక్తి నెలకొన్నది.

స్పీకర్ నిర్ణయంపైనే..పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యేల్లో గుబులు.. స్పీకర్ నిర్ణయమే ఫైనల్!

సుప్రీం తీర్పు తరువాత స్పీకర్ వెంటనే విచారణ ప్రక్రియ ప్రారంభించి, అక్టోబర్ చివరిలోపు తమపై వేటు వేస్తారేమోనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు టెన్షన్ లో ఉన్నారు. ఒకవేళ స్పీకర్ తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటి? ఉపఎన్నికలు మళ్లీ గెలుస్తామా? అందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు సహకరిస్తారా? అని ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజు నుంచే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ లీడర్ల మధ్య వర్గపోరు కొనసాగుతున్నది. ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చేందుకు జిల్లా ఇన్ చార్జి మంత్రులు తీవ్రంగా కృషి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఒక ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ లీడర్లు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సహకరించడం అంత ఈజీ కాదని తెలుస్తున్నది.

సీఎం ఏమంటారో?

బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం పార్టీ ఫిరాయించినట్లు బలమైన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీచేశారు. కాగా, కడియం శ్రీహరి.. తన కూతురు కావ్య తరఫున ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పలు సభల్లో పాల్గొన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై మాత్రం చర్యలు తీసుకునేందుకు కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఏం చేయాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు సదరు ఎమ్మెల్యేలు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది.

Next Story