అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న మహిళలు..

by Disha Web Desk 11 |
అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న మహిళలు..
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం ఇందిరా నగర్ కాలనీలోని అనర్హులకు, ఆస్తిపరులకే డబల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశారని నిరసిస్తూ కాలనీవాసులు, నిరుపేద మహిళలు గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాగా ధర్నా చేపడుతున్న సమయంలోనే జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ వారిని పట్టించుకోకుండా వెళ్లడంతో ఆగ్రహించి వారు వెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నారు. అనర్హులైన బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకే డబల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశారని అర్హులుగా తమను గుర్తించడం లేదని ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోయామని కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ప్రజావాణి హాల్లోకి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలన్నారు. అనర్హులు వారి పేర్లు వివరాలను ఒక పేపర్ మీద రాసి ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో పేర్లు రాసిచ్చే క్రమంలో జ్యోతి అనే మహిళ వీడియో తీస్తుందన్న అనుమానంతో కార్యాలయ సూపరింటెండెంట్ బాలరాజు మహిళ చేతి పట్టుకొని బలంగా ఒడి తిప్పడంతో మహిళ గాజులు పగిలి రక్తస్రావం జరిగింది. దీంతో మహిళలు కోపంతో అధికారిపై ఊగిపోయారు. ఇదిలా ఉండగా ఈ ధర్నాకు సహకరించిన బాభి దేవ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్హులుగా డబల్ బెడ్ రూం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అధికారులు అక్కసు వెళ్ళగక్కుతూ తమను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని మహిళలంతా ఆవేదన వ్యక్తం చేశారు.




Next Story

Most Viewed