రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర!.. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 5 |
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర!.. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీలను, భారతదేశ చరిత్రనే మార్చే విధంగా వీడియోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎన్నో చూశామని అన్నారు, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి అతి ఉత్సాహంతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఢిల్లీ పోలీసులను చేతిలో పెట్టుకొని వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినట్లు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలపైన పోరాటం చేసి ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని, వాళ్లు ఎంత భయపెట్టిన భయపడే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ చేయించిన సర్వేలో ఒక్కసీటు కూడా రాదని ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని, ఓ పీసీసీ ప్రెసిడెంట్ గా మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఏంటని? ప్రశ్నించారు. అంతేగాక రేవంత్ రెడ్డి అన్ని సభల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేసి రిజర్వేషన్లు తీసేసి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని బహిరంగంగా చెబుతున్నప్పుడు అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఏంటని? అన్నారు. అలాగే కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్లపై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్నారని, వీటన్నింటికీ ఒకటే చెబుతున్నామని, తెలంగాణ ప్రజలు మొన్ననే బీఆర్ఎస్ నియంత పాలనను తరిమికొట్టారని, బీజేపీ చర్యలు కూడా అలాగే ఉన్నాయని, కాబట్టి వాళ్లకు అదే గతి పడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed