బీజేపీపై జార్ఖండ్ ప్రజలు రగిలిపోతున్నారు: జేఎంఎం నేత కల్పనా సొరేన్

by Dishanational2 |
బీజేపీపై జార్ఖండ్ ప్రజలు రగిలిపోతున్నారు: జేఎంఎం నేత కల్పనా సొరేన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ప్రభుత్వంపై జార్ఖండ్ ప్రజలు రగిలిపోతున్నారని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత కల్పనా సొరేన్ అన్నారు. ఖనిజ సంపదను దోచుకుంటున్న ఈ శక్తులను రాష్ట్రం నుంచి తరిమికొడతారని చెప్పారు. గురువారం ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. హేమంత్ సొరేన్ అరెస్టు షాక్‌కు గురి చేసిందని తెలిపారు. కానీ తలవంచడం గిరిజనుల డీఎన్ఏలో లేదని, హేమంత్ మరింత బలపడతారని చెప్పారు. ‘మాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. హేమంత్ బెయిల్‌పై బయటకు వచ్చి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఎదురు చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్లాన్‌లో ఆయన చిక్కుకున్నారు’ అని తెలిపారు.

ప్రతిపక్షాలను అణచి వేసేందుకు బీజేపీ నియంతృత్వ ధోరణులను అవలంభిస్తోందని ఆరోపించారు. పేదలు, గిరిజనులు, దళితుల కోసం పని చేస్తున్న నేతలను అరెస్టు చేస్తే రాజ్యాంగం ఎలా రక్షింపబడుతుందని ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులన్నీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే హేమంత్ ను అరెస్టు చేశారని.. దీనికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని చెప్పారు. కాగా, రాష్ట్రంలో జరగనున్న గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో జేఎంఎం తరఫున కల్పనా సొరేన్ బరిలో నిలిచారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు మే 20న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది.

Next Story

Most Viewed