- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రసవత్తరంగా ఉప రాష్ట్రపతి ఎన్నిక.. గులాబీ పార్టీ ఎటువైపు?
ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ తరఫు నుంచి రాధాకృష్ణన్ బరిలో ఉండగా.. ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు పలికిన గులాబీ పార్టీ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొన్నది. 2024 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు సైతం గెలవలేదు. కానీ, రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి నలుగురు ఎంపీలు (సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి) ఉన్నారు.
సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుంటే కాంగ్రెస్ విమర్శలు
జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాది. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధం లేదు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పోరాటం చేశారు. రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయన్ను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. 2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్‌లో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలో విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్టు చేస్తుందా? అనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఆయనకు ఓటు వేయకుంటే.. గులాబీ పార్టీ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని టాక్. ఇప్పటికే బీజేపీతో స్నేహంగా ఉండేందుకు గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ వాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి సపోర్టు చేయడం మంచిదని అభిప్రాయాలు తెలంగాణ వాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ ఎటాక్..
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ లీడర్లు తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి గులాబీ పార్టీ మద్దతు ప్రకటిస్తే బీజేపీ విమర్శలకు దిగే అవకాశముంది. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ స్నేహం మరోసారి బయటపడిందని విమర్శలు బీజేపీ నేతల నుంచి వచ్చే అవకాశముంది.
ఓటింగ్‌కు దూరంగా?
ఒక వేళ గులాబీ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటే ఆ పార్టీ బీజేపీ డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నదనే విమర్శలు వచ్చే చాన్స్ ఉన్నది. దీనిపై గులాబీ రాజ్యసభ సభ్యులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమై రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.






