Sarpanch Elections: ముగిసిన పల్లె పోలింగ్.. ఆ ఊళ్లో కొట్టుకున్న అభ్యర్థులు!

by Prasad Jukanti |   (  Updated:2025-12-17 07:42:31  IST  )

తెలంగాణలో మూడో విడత పోలింగ్ ముగిసింది.

Sarpanch Elections: ముగిసిన పల్లె పోలింగ్.. ఆ ఊళ్లో కొట్టుకున్న అభ్యర్థులు!
X

దిశ, తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్ : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ (Telangana Panchayat Elections) ఎన్నికలు ముగిశాయి. మొదటి విడత (డిసెంబర్ 11), రెండో విడత (డిసెంబర్ 14) ముగియగా ఇవాళ మూడో విడత (Third Phase Polling) పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంటకు ముగియగా ఆ లోపు పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకుని క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఈరోపే ఉప సర్పంచ్‌లను సైతం ఎన్నుకోనున్నారు.

ఆఖరి పోరులో 3752 సర్పంచ్ స్థానాలు..

చివరిదైన మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రెండు జీపీలలో ఎన్నికలపై కోర్టు స్టే విధించడంతో మిగిలిన 3,752 పంచాయతీలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. ఇక 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా 116 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవం అయ్యాయి. 18 వార్డులలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో మిగిలి 28,410 వార్డులకు ఇవాళ పోలింగ్ జరిగింది.

పలుచోట్ల ఘర్షణలు, నిరసనలు..

పోలింగ్ సందర్భంగా ఇవాళ పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడుగుతున్నారని ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వారి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థి బోయిని రాములుకు గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో ఓ పోలింగ్ స్టేషన్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా తమ సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చేవరకు ఓట్లు వేయబోమని ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కొత్త మేడేపల్లి వాసులు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులకు సర్దిచెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓ సర్పంచ్ అభ్యర్థి వద్ద రూ. 28,500లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్న విద్యార్థి లవణ్‌‌కుమార్‌ ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌కు వచ్చాడు. ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

పోలింగ్ సరళిని పరిశీలించిన సీఈవో..

ఎన్నికల పోలింగ్ సరళిని మాసబ్‌ట్యాంక్ ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని పర్యవేక్షించారు. డ్యాష్ బోర్డు ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల పరిశీలకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీవోలు, సూక్ష్మ పరిశీలకులకు ఫోన్ చేసి గ్రౌండ్‌లో పరిస్థితిపై ఆరా తీశారు. నిర్మల్‌లో తక్కువ ఓటింగ్ నమోదవుతుండటంపై ఆమె అక్కడి అధికారులతో మాట్లాడారు.

Next Story