ORR లోపల 100 శాతం ఈవీలే లక్ష్యం.. జాతీయ రవాణా అభివృద్ధి మండలి భేటీలో మంత్రి పొన్నం

by Kema Shiva Kumar |

ఓఆర్‌ఆర్ పరిధిలో 100 శాతం, ఓఆర్‌ఆర్ వెలుపల 25 శాతం ఈవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ORR లోపల 100 శాతం ఈవీలే లక్ష్యం.. జాతీయ రవాణా అభివృద్ధి మండలి భేటీలో మంత్రి పొన్నం
X

దిశ, న్యూఢిల్లీ బ్యూరో: ఓఆర్‌ఆర్ పరిధిలో 100 శాతం, ఓఆర్‌ఆర్ వెలుపల 25 శాతం ఈవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో గురువారం కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన రవాణా అభివృద్ధి మండలి 43వ సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రవాణా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు, రహదారి భద్రత, పర్యావరణహితం వంటి అంశాలపై చర్చ జరిగింది. మొదట ఆర్టీసీ బస్సులు పూర్తిగా ఈవీలుగా మార్చి, అనంతరం టాక్సీలు, ఆటోలు, ఇతర కమర్షియల్ వాహనాలకు విస్తరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2020లో రాష్ట్రంలో 4376 ఈవీలు మాత్రమే ఉండగా, ఈవీ పాలసీ తర్వాత 2025 నాటికి 2.58 లక్షలకు చేరుకున్నాయని చెప్పారు. వాహనాల స్క్రాపింగ్ పాలసీ, 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల స్క్రాపింగ్, ప్రైవేట్ వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వంటి చర్యలతో కాలుష్యాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసి, ఫిట్నెస్ లేని వాహనాలను తొలగించడం ద్వారా రోడ్డు భద్రత పెంచనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల్లో ఏఐ, కెమెరాలు, సెన్సర్లు ప్రవేశపెట్టి మానవ ప్రమేయం తగ్గిస్తున్నట్లు చెప్పారు. ప్రజా రవాణాలో మహిళలు, పిల్లల భద్రత కోసం బస్సులు, టాక్సీల్లో ట్రాకింగ్ డివైసులు, ఏపీఎన్ఆర్ ఆధారిత కెమెరాలు, ఏఐతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్‌మెంట్, సారథి-వాహన్ డిజిటల్ వ్యవస్థలు, సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ వంటి సంస్కరణలను వివరించారు. రోడ్ సేఫ్టీపై స్కూల్‌లలో అవేర్‌నెస్ పార్కులు, కాలేజీల్లో క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నితిన్ గడ్కరీతో భేటీ..

ఈ సమావేశం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తెలంగాణకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను సమర్పించారు. రాష్ట్రంలో డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐడీటీఆర్) ఏర్పాటు, రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.175 కోట్ల ఎస్ఏఎస్సీ నిధులు, మోటార్ వాహనాల చట్ట సవరణలపై స్పష్టత కోరారు. రహదారి భద్రత, డ్రైవర్ శిక్షణ, ఆధునిక రవాణా వ్యవస్థకు కేంద్ర సహకారం అవసరమని విజ్ఞప్తి చేశారు. గడ్కరీ ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ నుంచి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా కమిషనర్ ఇలాంబర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story