- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt: భూభారతి చట్టం గైడ్ లైన్స్ అప్‌డేట్..
భూ సమస్యల పరిష్కారానికి రూపొందించిన భూభారతి చట్టాన్ని వచ్చే నెల నుంచి అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారానికి రూపొందించిన భూభారతి చట్టాన్ని వచ్చే నెల నుంచి అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఎంపిక చేసిన నాలుగు జిల్లాల కలెక్టర్లు, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, కొందరు రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్క్ షాప్ నిర్వహించారు. ఆ తర్వాత ఆర్వోఆర్ - 2025 గైడ్ లైన్ రూపకల్పన స్పీడ్ అందుకున్నది. భూ భారతి రూపకర్తతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిరంతరంగా పని చేస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో రెడీ చేసినట్లు తెలిసింది. అయితే వీటిని మొదట సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ పరిశీలిస్తారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి ఆమోదముద్ర వేయాలి. అనంతరం లీగల్ ఇష్యూస్ తలెత్తే అవకాశాలేమైనా ఉన్నాయా అని న్యాయ శాఖ పరిశీలిస్తుంది. ఆ పై సీఎం రేవంత్ రెడ్డి తుది పరిశీలనకు గైడ్ లైన్స్‌ను పంపిస్తారని సమాచారం. అయితే భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తుగానే ఉన్నతాధికారులు అన్నింటినీ చెక్ చేసుకుంటున్నారు. 19 సెక్షన్లతో అమలు చేయాల్సిన చట్టం కావడంతో అధికార యంత్రాంగాన్ని సైతం ముందస్తుగా సమాయత్తం చేయాల్సి ఉన్నది.
తేదీలపై త్వరలో ప్రకటన!
ప్రభుత్వ పెద్దలు భూ భారతి రూల్స్‌ను ఆమోదించిన తర్వాత పద్ధతి ప్రకారం కేబినెట్‌లో చర్చిస్తారు. నిజానికి కేబినెట్ తీర్మానించాల్సిన అవసరం లేదు. కానీ ఏ చట్టమైనా అమలులోకి తీసుకొచ్చే ముందు మంత్రివర్గ పరిశీలన అనివార్యం. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఆర్వోఆర్-2025 చట్టంలోని ఏయే అంశాలను ఏ తేదీ నుంచి నోటిఫై చేస్తారన్నది ప్రకటిస్తారు. 19 సెక్షన్లను ఒకే సారి అమలులోకి తీసుకురావచ్చు. అవసరమైన వ్యవస్థలు ఏర్పడకపోతే మొదట కొన్ని సెక్షన్లకే పరిమితమయ్యే చాన్స్ ఉంది. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ లో సర్వే మ్యాప్ ఉండాలన్న నిబంధన ఉంది. అయితే దాని కోసం లైసెన్సుడ్ సర్వేయర్ల వ్యవస్థ ఏర్పడాలి. ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప సేల్ డీడ్ లో సర్వే మ్యాప్ విధానాన్ని అమలు చేయడం కుదరదు. అప్పీల్ వ్యవస్థలకు సంబంధించిన విధి విధానాలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు ముందే చేపట్టాలి. ఆటోమెటిక్ సక్సెషన్ కి బదులుగా విచారణ చేయాలన్న నిబంధన ఉంది. ఇక్కడ నోటీసులు జారీ చేసేందుకు మానవ వనరులు అవసరం. ఇప్పటికీ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ జరగలేదు. అలాంటప్పుడు నోటీసులు సర్వ్ చేసే బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలు సెక్షన్ల అమలుకు ముందే అవసరమైన వ్యవస్థల రూపకల్పన తప్పనిసరి. అందుకే భూ భారతి చట్టంలోని అన్ని సెక్షన్లను ఒకేసారి అమలు చేస్తారో లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏది?
భూ భారతి చట్టం అమలు కావాలంటే గ్రామ రెవెన్యూ వ్యవస్థ తప్పనిసరి. దీంతో పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలను తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. రెవెన్యూలోకి రావాలనుకున్న వారి నుంచి ఆప్షన్లు తీసుకున్నది. దీంతో ఆ వారంలోనే తిరిగి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ క్రమంలోనే రాత పరీక్ష ద్వారానే గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ పరిస్థితి గందరగోళంలోకి నెట్టేసింది. తాము ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికయ్యామని, సుదీర్ఘ అనుభవమున్న తమను పరీక్ష రాయాలనడం అవమానించడమేనని పూర్వ వీఆర్వోలు వాపోతున్నారు. భూ భారతి చట్టంలోని కొన్ని అంశాలను అమలు చేసేందుకు ప్రతి రెవెన్యూ విలేజ్ లో ఎవరో ఒక ఉద్యోగి తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నది. అంటే ఈ చట్టం అమల్లోకి రాకముందే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. విలేజ్ అకౌంట్ నిర్వహణ, విచారణ, నోటీసుల జారీ వంటి అనేకాంశాలు గ్రామ స్థాయి ఉద్యోగి ద్వారానే సాధ్యమని చట్టంలోనే ఉంది. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలంటే తొలుత 10,984 పోస్టులను సృష్టించాలి. ఆ తర్వాత గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను రూపొందిస్తూ చట్టమే చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలు చట్టబద్ధంగా రద్దయ్యాయి. అలాంటి వ్యవస్థల పునరుద్ధరణ జీవోలతో సాధ్యం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మ్యాప్ కోసం కసరత్తు
కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సేల్ డీడ్‌లో సర్వే మ్యాప్ వంటి విధానాలను అమలు చేస్తున్నారు. దాంతోనే సరిహద్దు వివాదాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ధరణి కమిటీ సభ్యుల అధ్యయనంలో తేలింది. తెలంగాణలో ఈ వివాదాలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో అన్నింటినీ ఒకేసారి పరిష్కరించడం కష్టతరమైంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ను అధ్యయనం చేయడం ద్వారానే భూ భారతి చట్టంలో సర్వే మ్యాప్ విధానాన్ని చేర్చినట్లు చట్టం రూపకర్త భూమి సునీల్ అంటున్నారు. అయితే తెలంగాణలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. పైగా సేల్ డీడ్ లో సర్వే మ్యాప్ కోసం సర్వేయర్లే పని చేయాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయాన్ని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మందికి పైగా లైసెన్సుడ్ సర్వేయర్లు ఉన్నారు. వారికే ఈ బాధ్యతలను అప్పగించడం ద్వారా మండల సర్వేయర్ల మీద ఒత్తిడి ఉండదు. పైగా ఎలాగూ భూదార్ పర్మినెంట్ నంబర్ ఇచ్చేటప్పుడు సర్వే చేయడానికి అధికారిక సర్వేయర్లకు ఫుల్ వర్క్ ఉంటుంది. ఈ లోపు లైసెన్సుడ్ సర్వేయర్లకు పని అప్పగించడం వల్ల వారికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని అభిప్రాయం. అయితే భూ భారతి చట్టం అమలుకు ముందే ఈ లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్య తేల్చాలి. ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేస్తారన్నది ఖరారు చేయాలి. దాంతోపాటు ప్రతి సర్వే మ్యాప్ కి వీళ్లు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలను రూల్స్ లో పేర్కొనాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే లైసెన్సుడ్ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించడాన్ని మండల సర్వేయర్లు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇదేమీ వారి విధులకు ఆటంకం కలిగించేది కాదన్న చర్చ కూడా ఉంది. నివాస స్థలాల సేల్ డీడ్స్‌లోని సర్వే మ్యాప్ మాదిరిగానే వ్యవసాయ భూములకు మ్యాప్ ఉండడం ద్వారా చిక్కుల్లేని రెవెన్యూ రికార్డులు ఏర్పడుతాయన్న సదాశయంతో భూభారతిలో ఈ విధానాన్ని చేర్చారు.
భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా..
భూ భారతి చట్టంలోని 19 సెక్షన్లల్లో ఒక్కొక్కటి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉదాహరణకు సాదాబైనామాల పరిష్కారానికి 9 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అంటే ఈ సంఖ్య ఎంత శాతమో అంచనా వేయొచ్చు. అలాగే ఇప్పటి దాకా చట్ట విరుద్ధంగా రద్దు చేసిన అప్పీల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారా సామాన్యుడికి ఎంతో మేలు కలుగుతుంది. కింది స్థాయి అధికారి న్యాయం చేయలేదని భావిస్తే ఇప్పటి దాకా కోర్టుకే వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడందుకు భిన్నంగా ఉన్నతాధికారులకు మొర పెట్టుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఇలాంటి ప్రతి అంశం ప్రాధాన్యతతో కూడినది. అందుకే భూ చట్టాల నిపుణులు భూమి సునీల్‌తో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పలుసార్లు భేటీ అయ్యారు. గైడ్ లైన్స్ తయారీలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.






