RRR: ప్రజ్ఞాపూర్‌లో అనేక వింతలు.. హాట్ టాపిక్‌గా మారిన త్రిడీ నోటిఫికేషన్‌

by Gantepaka Srikanth |

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అన్ని రకాల అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నది.

RRR: ప్రజ్ఞాపూర్‌లో అనేక వింతలు.. హాట్ టాపిక్‌గా మారిన త్రిడీ నోటిఫికేషన్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అన్ని రకాల అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే భూసేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే కొందరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ఇక్కడ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ జరుగుతున్నది. లేని భూమికి పరిహారం పొందేందుకు కొందరు వ్యూహరచన చేస్తుండగా.. వీరికి అధికారుల సహకారం అందుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్ఎస్ఆర్ ను సరి చేయకుండానే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో భూ నష్టపరిహారం అందించే లిస్ట్ తయారు చేయడం, త్రిడీ నోటిఫికేషన్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు.

ప్రజ్ఞాపూర్ సర్వే నంబర్ 358లో..

గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో 67.129 నుంచి 98.989 కి.మీ. వరకు భూ సేకరణ జరిపేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బేగంపేట, ఎల్కల్, బంగ్లా వెంకటాపూర్, మక్తా మాసాన్ పల్లి, సంగాపూర్, ముత్రాజ్ పల్లి, ప్రజ్ఞాపూర్, మెంటూరు, జబ్బాపూర్, మైలారం మక్తా, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, ఎర్రవెల్లి, అలిరాజాపేట, ఇటిక్యాల, పీర్లపల్లి తదితర గ్రామాల్లో భూ సేకరణ జరిపేందుకు సర్వే పూర్తయ్యింది. పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణంతో సహా భూ సేకరణకు సంబంధించిన అన్ని వివరాలను పేర్కొన్నారు. ప్రజ్ఞాపూర్ సర్వే నం.358లో 43.761 ఎకరాలను సేకరించనున్నట్లు ప్రస్తావించారు. ఇందులో 37 మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. అయితే 1979–80 పహానీ ప్రకారం ప్రజ్ఞాపూర్ సర్వే నం.358/1లో మొత్తం విస్తీర్ణం 250.24 ఎకరాలుగా ఉంది. ఇందులో వెంకటచంద్రశేఖర్, సరోజినీదేవి పేరిట, కుర్రె నారాయణరెడ్డి, కుర్రె రాంరెడ్డి, మహ్మద్ షీరఫ్, ఖైరున్నీసా బేగం, రాధాదేవి పేరిట భూములు ఉన్నాయి. ఇందులో నుంచి 49 ఎకరాలను ల్యాండ్ సీలింగ్ లో సరెండర్ చేయబడినదని స్పష్టంగా తెలిపారు. సర్వే నం.358/1లో 2006–07 పహానీలో తహశీల్దార్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఐదుగురికి వీఆర్వో పట్టా చేశారని.. అదే సర్వే నంబరులో 8.14 ఎకరాల పట్టాదారుడు 2014 అక్టోబరులో అప్పటి మెదక్ కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

భూములు లేకున్నా రికార్డుల్లోకి..

ప్రజ్ఞాపూర్‌లో భూములు లేకున్నా కొందరు రెవెన్యూ రికార్డుల్లో ఎక్కారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఖాస్రాతో పోలిస్తే ఆయా సర్వే నంబర్లల్లో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం పెరిగిందనే చర్చ జరుగుతున్నది. ఉదాహారణకు సర్వే నం.358/5ఎలో 1992–93 నుంచి 1999–2000 వరకు మొత్తం విస్తీర్ణం 27.11 ఎకరాలుగా ఉంది. 2000–01 నుంచి 2004–05 వరకు 32.03 ఎకరాలకు పెరిగింది. 2005–06 నుంచి 2009–10 వరకు 27.19 ఎకరాలుగా మారింది. ఇందులో 7.09 ఎకరాలను నమోదు చేయలేదు. అయితే ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా 2005–06 నుంచి ఐదుగురి పేర్లను ఇల్లీగల్ గా నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2010–11 నుంచి 2025 కు వచ్చేసరికి ఈ విస్తీర్ణం 25.24 ఎకరాలకు చేరింది. అప్పుడు 6.06 ఎకరాలు ఎటో పోయాయి. తాజాగా భూ భారతి రికార్డులో ఏకంగా 29.32 ఎకరాలకు పెంచారు. అయినా 6.05 ఎకరాలు రికార్డు చేయలేదు. ఇలా విస్తీర్ణాన్ని పెంచేశారు. అలాగే 375/5లో ఉండాల్సిన కొందరి విస్తీర్ణాన్ని సర్వే నంబరును 358/4 కు మార్చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ జాబితా, ఎంజాయ్ మెంట్ సర్వే వివరాల్లో ఇల్లీగల్ గా రికార్డుల్లోకెక్కిన వారి పేర్లు కూడా ఉన్నాయి.

అదనపు విస్తీర్ణం నమోదు

– ప్రజ్ఞాపూర్ సర్వే నం.358/1లో 250.24 ఎకరాలు, 368/2లో 200 ఎకరాలుగా సేత్వార్ నుంచి ఉంది. అంటే మొత్తం 450.24 ఎకరాలు.

– ఆ తర్వాత సర్వే నం.358/2 సబ్ డివిజన్లుగా మారింది. 358/2 నుంచి 258/6 గా చేరింది. ఇందులో 124.31 ఎకరాలు పట్టాగా, 18.11 ఎకరాలు సీలింగ్ సర్ ప్లస్ గా అయ్యింది. ఆ తర్వాత సర్వే నం.358లో మొత్తం విస్తీర్ణం 393 గా మార్చేశారు. అంటే 358/1లో 250.24 ఎకరాలు, 358/2 నుంచి 358/6 వరకు 143 ఎకరాలు.

– 2004–05 లో ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా 358/1, 358/4, 358/5 లో ఇల్లీగల్ ఎంట్రీస్ వచ్చాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు 54.35 ఎకరాలు అదనంగా చేర్చారు. 2005 నుంచి ధరణి పోర్టల్ వరకు అదే విస్తీర్ణం చూపిస్తున్నది.

– ఇదే అంశాన్ని కొందరు గ్రామస్తులు 2014 నుంచి తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.

అనేక ఫిర్యాదులు..

ఎలాంటి ఆధారాలు లేకున్నా 2007 నుంచి చాలా మందిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని, ఇల్లీగల్ గా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారని అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అయినా వాటిపై ఎలాంటి విచారణ చేయకుండా, సమస్యకు పరిష్కారం చూపెట్టకుండా ఫేక్ ఎంజాయ్మెంట్ సర్వేతో వారి పేర్లను భూపరిహారానికి సంబంధించి జాబితాలో పేర్కొన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టాదారు పాసు పుస్తకంలో సర్వే నంబరు మిస్ అయ్యిందని, విస్తీర్ణం తక్కువ నమోదైందని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే.. ఆర్ఎస్ఆర్ పెరిగిందంటూ రెవెన్యూ అధికారులు ఏండ్ల తరబడి తిప్పించుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే జాబితాను త్రీడీ నోటిఫికేషన్ లో పేర్కొన్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఎకరం మార్కెట్ (రిజిస్ట్రేషన్) విలువ రూ.21 లక్షలుగా ఉంది. భూ సేకరణ చట్టం ప్రకారమైతే సదరు యజమానులకు ఎకరానికి రూ.60 లక్షలకు పైగానే ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. రికార్డులను వెరిఫై చేయకుండా, పొషెషన్ కు సరిగ్గా గుర్తించకుండానే ఎంజాయ్ మెంట్ సర్వే చేసినట్లు సమాచారం. గజ్వేల్ మండలం బేగంపేట, ఎల్కల్, బంగ్లా వెంకటాపూర్, మక్తా మాసాన్ పల్లి, సంగాపూర్, ముత్రాజ్ పల్లి, ప్రజ్ఞాపూర్, మెంటూరు, జబ్బాపూర్, మైలారం మక్తా, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, ఎర్రవెల్లి, అలిరాజాపేట, ఇటిక్యాల, పీర్లపల్లి గ్రామాల్లో చేపట్టనున్న భూ సేకరణ జాబితాపై రెవెన్యూ రికార్డుల ఆధారంగా మరోసారి ఎంజాయ్ మెంట్ సర్వేను చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఆధారాలతో రుజువు చేసినా..

సర్వే నం.358లో 2005 నుంచి ఇల్లీగల్ గా రికార్డుల్లో కొనసాగిస్తున్నారని తాము ఆధారాలతో రుజువు చేసినా తొలగించలేదని ప్రజ్ఞాపూర్ కు చెందిన పలువురు రెవెన్యూ అధికారులపై మండిపడుతున్నారు. దీంతో ఎవరైతే నిజంగా పొషెషన్ కు తగ్గట్లుగా రికార్డుల్లో ఉన్నారో వారికి అన్యాయం జరుగుతున్నదంటున్నారు. 2023లో త్రీడీ నోటిఫికేషన్ ద్వారా పట్టాదారుల పేర్లను ప్రకటించారు. అందులోనూ ఇల్లీగల్ ఎంట్రీస్ ఉన్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. అంతేకాకుండా ఇల్లీగల్ గా రికార్డుల్లో కొనసాగుతున్న వారిని తొలగించాలని భూ భారతి చట్టం చెప్తున్నది. ఈ నేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణలో నష్టపోతున్న వారిని మరోసారి ఎంజాయ్ మెంట్ సర్వే చేసి గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క సర్వే నంబరులోనే ఆరుగురికి పైగా అక్రమ పట్టాదారులు త్రీడీ నోటిఫికేషన్ లో ఉన్నారని, దీని వల్ల ఒరిజినల్ పట్టాదారులపై ప్రభావం పడుతున్నదని వ్యక్తం చేస్తున్నారు.

Next Story