కేంద్రం వద్దే కోట్ల ప్రాజెక్టులు.. నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో చేపట్టనున్న మెగా అర్బన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విన్నవించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం అందజేశారు.

కేంద్రం వద్దే కోట్ల ప్రాజెక్టులు.. నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చేపట్టనున్న మెగా అర్బన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విన్నవించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం అందజేశారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఢిల్లీలో జరిగిన ఫ్రీ బడ్జెట్ మీటింగ్‌లోనూ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క విన్నవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు, సీవరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి అందజేశారు.

రూ.4,170కోట్లతో..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో భారీ వర్షాల సమయంలో నగరమంతా నీటితో మునుగుతోంది. 2024లో కురిసిన భారీ వర్షాలకు నగరమంతా నీటమునిగింది. అయితే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సుభ్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ సంస్థ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు రూ.4,170కోట్లు అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

రూ.17,212.69 కోట్లతో సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 27పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో జీహెచ్ఎంసీ పరిధి 2053 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది. అయితే హైదరాబాద్ కోర్ సిటీలో మాత్రమే మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ ఉన్నది. కానీ, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎలాంటి సీవరేజ్ సిస్టం లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో సమగ్ర మురుగునీటి వ్యవస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీవరేజ్ నెట్‌వర్క్ తోపాటు ట్రంక్ మెయిన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రూ.17,212.69కోట్లు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అమృత్ 2.0లో నిధులు కేటాయించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అక్టోబర్ 2024లో కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు..

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ఉన్న మూసీనదిని కాంగ్రెస్ ప్రభుత్వం ‘మూసీ పునరుజ్జీవనం’ ప్రాజెక్ట్ పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మొత్తం 55 కిలోమీటర్ల పరిధిలోని ప్రాజెక్టును ఐదు జోన్లుగా డెవలప్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మొదటి దశలో లంగర్ హౌస్‌లోని బాపుఘాట్ వద్ద ‘గాంధీ సరోవర్’ పేరుతో పూర్తి చేయాలని నిర్ణయించారు. దీని కోసం 98.20 ఎకరాల రక్షణశాఖకు సంబంధించిన భూమి అవసరమని గుర్తించింది. ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

జలశక్తి శాఖకు రూ.3,188 కోట్ల ప్రతిపాదనలు..

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లులు కీలకంగా మారాయి. అయితే మూసీలో గోదావరి జలాలను పారించడంతోపాటు మురుగునీటి రాకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మురుగునీటి శుద్ధి చేయడంతోపాటు అసలు మూసీలోకి మురుగునీటినే రాకుండా చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.3,188కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు.

Next Story