- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఎగరబోయేది కాషాయ జెండానే.. సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ధీమా
హైదరాబాద్ బీజేపీ అడ్డా అని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా తమ పార్టీని అడ్డుకోలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ బీజేపీ అడ్డా అని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా తమ పార్టీని అడ్డుకోలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతోపాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలోని బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావడం పార్టీ బలాన్ని చాటుతోందన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ విజయం సాధించడం ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలను సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మార్చేశారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయేదని.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో చిన్న వర్షానికే నగరం జలమయమవుతున్నదని విమర్శించారు. రోడ్లపై వరదనీరు నిలవడం, వాహనాలు చిక్కుకుపోవడం, విద్యుత్ షాక్‌లతో ప్రాణనష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. నగర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆరోపించారు.
ఎస్ఐఆర్‌పై దుష్ప్రచారం..
ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాంచందర్ రావు విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ వల్లే బీజేపీ గెలిచిందని చెబుతున్నారని.. అయితే.. కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ప్రజా మద్దతు ఉన్న పార్టీనే గెలుస్తుందని, తెలంగాణలో కూడా ప్రజల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో చేతులు కలిపి అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం రోహింగ్యాలు, అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుల ఓట్లతో హైదరాబాద్‌లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని పేర్కొన్నారు. అలాంటి అక్రమ ఓట్ల నమోదు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను, విధానాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా..
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, శాసనసభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, పశ్చిమ బెంగాల్‌లోనూ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతున్నదని, గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గణనీయమైన ఓట్ల శాతంతోపాటు కీలక స్థానాల్లో విజయం సాధించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సహాయం, పంటల బోనస్ వంటి పలు హామీలు ఇంకా అమలు కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెంచి ఆర్థిక పరిస్థితిని బలహీనపరిచిందని విమర్శించారు. నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని అన్నారు. రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి బస్తీ, ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. అర్హులైన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా నమోదు కావాలని, అదే సమయంలో అక్రమంగా పేర్లు నమోదు అయినట్లయితే వాటిని తొలగించే ప్రక్రియకు సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు మార్చుకుంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ప్రచారం అసత్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి రైల్వేలు, జాతీయ రహదారులు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి అంశాలపై ప్రజలతో కలిసి పనిచేయాలని, ప్రతి బూత్ కమిటీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఎల్‌వోలుగా పనిచేస్తున్నది మీ అధికారులే..
బీఎల్వోగా పనిచేసేది ప్రభుత్వ అధికారులే అని.. మరి బీజేపీ ఎలా ఓట్లు తొలగిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. నితిన్ నబీన్ తొలిసారి మన గడ్డ మీద అడుగుపెట్టారన్నారు. గతంలో 150 సీట్లు ఉన్ననాడే 48 సీట్లు గెలిచి బీజేపీ అజేయ శక్తిగా నిలిచిందని.. జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు ఎంపీ సీట్లు ఉంటే నాలుగు ఎంపీ సీట్లు బీజేపీనే గెలిచిందని అన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని చెప్పారు. సర్ పేరుతో కాంగ్రెస్ ఎంఐఎం విమర్శలు చేస్తున్నదని.. ఓడిపోతారనే భయం పట్టుకోవడంతో ఇలాంటి తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. బెంగాల్ ప్రజానీకం అహంకారానికి, దోపిడీకి ఎలా చరమగీతం పాడారో.. రేపు తెలంగాణ ప్రజలు సైతం అలాంటి తీర్పే ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి అంచున ఉన్నదని హెచ్చరించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కల్పించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యమని.. ఓట్ల గల్లంతును అరికట్టడం కోసమే సర్ ప్రక్రియ అని స్పష్టం చేశారు. గతంలో ఒక్కో ఇంట్లో 20 దొంగ ఓట్లు రాయించి గెలిచే ప్రయత్నం చేశారని.. అందుకే సర్ పేరు చెప్పగానే వారికి భయం అవుతున్నదని ఎద్దేవా చేశారు. సర్ తెచ్చి దొంగ ఓటుకు చరమగీతం పాడబోతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశామని.. ఇక తమ ఓటు బీజేపీకే అని ప్రజలు అంటున్నారని చెప్పారు. ఈ గడ్డమీద ఎగిరేది కాషాయ జెండానే అని తెలిపారు.






