గులాబీ కోటలో కమలం గర్జన.. హస్తం జోరు: ఉత్తర తెలంగాణలో వెలవెలబోయిన కారు!

by Kema Shiva Kumar |

ఒకప్పుడు బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం ఆ పార్టీ ఉనికి కోల్పోతూ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్థానిక నాయకత్వ లోపాలు, అంతర్గత విభేదాలు, ప్రత్యర్థి పార్టీల దూకుడుతో ఉద్యమ గడ్డపైనే గులాబీ జెండా వెనుకంజ వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గులాబీ కోటలో కమలం గర్జన.. హస్తం జోరు: ఉత్తర తెలంగాణలో వెలవెలబోయిన కారు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్. ఆ పార్టీ పురుడు పోసుకున్నది సైతం కరీంనగర్‌లోనే. ఉద్యమం నుంచి పార్టీని అక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. గత పదేళ్లు ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండాలే రెపరెపలాడాయి. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి బలమైన భూమిక వేసిన ప్రాంతాల్లోనే ఇప్పుడు బీఆర్ఎస్ వెనుకంజ వేయాల్సి రావడంపై చర్చ మొదలైంది. ఒకప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలు బీఆర్ఎస్‌కు పెట్టని కోటలుగా ఉండేవి. టీఆర్ఎస్ ఆవిర్భావ సభను సైతం కేసీఆర్ కరీంనగర్ కేంద్రంగా సింహగర్జన పేరిట నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాంటి పార్టీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగు అవుతున్నది.

కార్పొరేషన్లలో ఖాతా తెరవలేదు..

ఒకప్పుడు బీఆర్ఎస్‌కు కంచుకోటలుగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కొన్నిచోట్ల గులాబీ పార్టీ మూడో, నాలుగో స్థానానికి పరిమితమవ్వాల్సిన పరిస్థితి రావడం పార్టీ శ్రేణులకు మింగుడు పడని విషయంగా మారింది. ఈ మార్పు కేవలం ఓటు శాతంలోనే కాదు గ్రామస్థాయిలో రాజకీయ ప్రభావం తగ్గడంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్లలో బీఆర్ఎస్ 9 స్థానాలకు పడిపోవడం గమనార్హం. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో కనీసం ఒక్కచోటైనా ఖాతా తెరవలేకపోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ వెనుకబడటానికి స్థానిక నాయకత్వం బలహీనత, అంతర్గత విభేదాలు, అభివృద్ధి పనులపై అసంతృప్తి, ప్రత్యర్థి పార్టీల దూకుడు, సామాజిక సమీకరణాల్లో మార్పులతోపాటు తదితర లోకల్ ఇష్యూస్ కారణంగా నిలిచాయన్న చర్చ స్థానికంగా సాగుతోంది.

Next Story