మెడికల్ కాలేజీల 'అద్దె' మాయాజాలం.. ప్రభుత్వ లక్ష్యానికి వైద్య, ఆరోగ్య శాఖ తూట్లు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-16 01:48:50  IST  )

తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, వైద్య, ఆరోగ్య శాఖ 13 మెడికల్ కాలేజీల అద్దె భవనాల కోసం ఏటా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా మెదక్, మహేశ్వరం వంటి చోట్ల అద్దెలు అసాధారణంగా పెంచి చెల్లిస్తుండటంపై కమీషన్ల దందా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

మెడికల్ కాలేజీల అద్దె మాయాజాలం.. ప్రభుత్వ లక్ష్యానికి వైద్య, ఆరోగ్య శాఖ తూట్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి వైద్యారోగ్య శాఖ తూట్లు పొడుస్తున్నది. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను జనవరి 1 నుంచి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేయాలని ట్రెజరీ విభాగానికి సర్క్యులర్ సైతం జారీ చేసింది. కానీ, ఇవేమీ తమకు వర్తించవన్నట్టు వైద్యారోగ్య విభాగం వ్యవహరిస్తున్నది. కొత్త మెడికల్ కాలేజీలు, హాస్టళ్ల అద్దెల కోసమే ఏటా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు పొదుపు మంత్రం జపిస్తుంటే.. అధికారులు మాత్రం ప్రజాధనాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తూ ఖజానాపై మరింత భారం మోపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

నెలకు రూ. 81 లక్షలకు పైగానే..

అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం నెలకు రూ. 81.27 లక్షల చొప్పున ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల వరకు అద్దె చెల్లిస్తున్నారు. మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట మెడికల్ కాలేజీలకు సంబంధించి వైద్య విద్యార్థుల వసతి గృహాలు (హాస్టళ్లు) అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్, యాదాద్రి భువనగిరిలో కాలేజీ భవనాల కోసం సైతం భారీగా రెంట్లు చెల్లిస్తున్నారు.

కమీషన్ల అనుమానాలు..

అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మహేశ్వరం కళాశాల వ్యవహారం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం మంగళ్‌పల్లిలోని భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (BIET)లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీకి నెలకు ఏకంగా రూ. 18.88 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. ఒక ప్రభుత్వ కాలేజీ కోసం ఇంత భారీ మొత్తంలో అద్దెను నిర్ణయించడం 'క్విడ్ ప్రో కో' (Quid Pro Quo)కు నిలువెత్తు నిదర్శనమని సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇక కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్ కోసం కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ప్రైవేటు భవనానికి నెలకు రూ. 14.37 లక్షలు చెల్లిస్తున్నారు. యాదాద్రి భువనగిరి కాలేజీకి రూ. 6.72 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం కాలేజీకి రూ. 5.21 లక్షల చొప్పున అధికారులు ఉదారంగా ముట్టజెబుతున్నారు. దీంతో అద్దెల మాటున కమీషన్ల దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖజానాపై అనవసర భారం

ఒకవైపు అప్పులు, పెండింగ్ బిల్లులు, సంక్షేమ పథకాల భారం అంటూ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి పెట్టిన వేళ... మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కోట్లాది రూపాయలు అద్దెలు చెల్లించడం ఖజానాకు అనవసర భారంగా మారుతున్నది. ప్రభుత్వ భవనాలను వినియోగించుకుని ఈ అద్దెలను తగ్గిస్తే... అదే మొత్తాన్ని వైద్య మౌలిక వసతుల మెరుగుదలకు, ఆసుపత్రుల్లో సౌకర్యాల పెంపునకు వినియోగించే అవకాశం ఉంటుంది. అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను కొనసాగించకూడదన్న తాజా నిర్ణయాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు, వైద్య విద్యా నిపుణులు సూచిస్తున్నారు. భారీ అద్దె నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష జరిపి... ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి కాలేజీలను తరలిస్తేనే ఖజానాపై భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

మెదక్‌లో అద్దె మాయాజాలం

మెదక్ మెడికల్ కాలేజీ అద్దె వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తున్నది. గతంలో ఇదే అద్దె భవనంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కొనసాగింది. అప్పుడు ప్రభుత్వం చెల్లించిన అద్దె రూ. 5.50 లక్షలు మాత్రమే. సొంత భవనంలోకి కలెక్టరేట్ మారాక ఈ భవనం ఖాళీ అయింది. ఆ తర్వాత దీనిని మెడికల్ కాలేజీ కోసం తీసుకున్నారు. పాత అద్దెకు 5 నుంచి 10 శాతం పెంచాల్సింది పోయి.. ఏకంగా రెండు నుంచి మూడు రెట్లు పెంచి రూ. 16.10 లక్షలుగా అద్దె నిర్ణయించారు. అంటే దాదాపు 193 శాతం పెంచి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. కాగా, మెడికల్ కాలేజీల భారీ అద్దెలపై డీఎంఈ (DME) డా. నరేంద్ర కుమార్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

Next Story