- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ జనంలోకి గులాబీ బాస్.. జిల్లాల్లో వరుస బహిరంగ సభలకు ప్లాన్!
రాష్ట్రవ్యాప్త పర్యటనలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక నుంచి ప్రజల్లో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాల సభతో ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. జగిత్యాల సభతో వచ్చిన మైలేజీతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తవుతున్నందునా.. ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని.. ఇక ఊరుకునేది లేదంటూ ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు పార్టీని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
27న హైదరాబాద్ కీలక సమావేశం
పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై దృష్టి సారిస్తూ ఈ నెల 27న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్య సమావేశాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. అదే రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం.. రజతోత్సవ వేడుకలు ముగింపు కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నారు. పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపును పురస్కరించుకుని కేసీఆర్ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను సైతం ఈ భేటీకి ఆహ్వానించినట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
పార్టీ బలోపేతంపైనే దృష్టి..
పార్టీ సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే 27న నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితోపాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపైనా స్పష్టత రానుంది. జిల్లా, మండల స్థాయిలోనూ పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, నాయకత్వాన్ని చురుకుగా మార్చడం వంటి అంశాలు ఎజెండాలో ఉండనున్నాయి. కొత్త సభ్యులను ఆకర్షించడం, యువతను పార్టీలోకి తీసుకురావడం, గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరణ జరగాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కేసీఆర్ పలు సూచనలు ఇస్తారని తెలిసింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. ప్రతిపక్షాలపై దూకుడు పెంచడం, ప్రజా సమస్యలపై మరింతగా స్పందించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సభల ద్వారా పార్టీ శక్తిని ప్రదర్శించడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బహిరంగ సభలు పార్టీకి మళ్లీ ఉత్సాహాన్ని నింపే అవకాశమున్నదని నేతలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా వచ్చే నెల మొదటి వారంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.






