పాశమైలారం మృతులకు రూ.కోటి పరిహారం ఇప్పిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-01 08:39:22  IST  )

పాశమైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

పాశమైలారం మృతులకు రూ.కోటి పరిహారం ఇప్పిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్/పటాన్‌చెరు: పాశమైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. పరిశ్రమ యాజమాన్యంతో పాటు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ బయట బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిగాచీ పరిశ్రమలో సోమవారం ఉదయం 143 మంది విధులు నిర్వహిస్తున్నారని అందులో 56 మంది క్షేమంగా ఉండగా, 36 మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. మిగిలిన వారి ఆచూకీ కోసం ఇప్పటి వరకు జరిగిన ప్రమాదంలో 37 మంది మరణించారని వెల్లడించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం నుంచి మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎన్‌డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను ఉధృతం చేశారని వివరించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.

మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్ర గాయాలైన వారికి రూ.10 లక్షలు

సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం నుంచి రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్ప గాయలైన వారికి రూ.5 లక్షలు నష్ట పరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. మృతదేహాలను వారి సొంత స్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ విషాద ఘటనలో బాధితులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Next Story