CM Revanth Reddy : అసలైన తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించాల్సిన అవసరం ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

అసలైన తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు.

CM Revanth Reddy : అసలైన తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించాల్సిన అవసరం ఉంది : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : అసలైన తెలంగాణ ఉద్యమ చరిత్రను లిఖించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. శుక్రవారం మలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ యోధుడు, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్(Tulla Devendar Goud) రచించిన 'విజయ తెలంగాణ' పుస్తకాన్ని(Vijaya Telangana Book) హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది యువకులు, విద్యార్థుల త్యాగాలు, సబ్బండ వర్ణాల మద్దతుతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని, అలాంటి ఉద్యమ చరిత్రను ఏ కొందరు వ్యక్తులో తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించినప్పుడు, నిజంగా త్యాగాలు చేసిన సిసలైన ఉద్యమకారులకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను బయటికి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల కోణాన్ని ఆవిష్కరించిన పుస్తకం 'విజయ తెలంగాణ' అని, ఇలాంటి రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారు. విజయ తెలంగాణ వారి స్వీయ చరిత్ర కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందుపర్చిన పుస్తకం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పోరాటాలు సాహసోపేతమైనవి. గోదావరి జలాల తరలింపు కోసం దేవేందర్ గౌడ్ ఆ నాడు చేసిన పాదయాత్ర ఫలితంగానే 'ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు'కు ఆమోదం లభించింది. తెలంగాణ అంటే టీజీ అని రాయించింది దేవేందర్ గౌడ్ అని, ఉద్యమంలో యువకులు బండ్ల పైనే కాదు, గుండెలపైనా టీజీ అని రాసుకున్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీ గా మార్చాం అన్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత జయ జయహే తెలంగాణ పాటను అధికారిక గీతంగా గుర్తించడంగానీ, తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన 9 మంది ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఆర్థిక సహాయ ప్రకటన వంటి నిర్ణయాలు ప్రజలు కోరుకున్న విధంగానే తీసుకున్నామని తెలిపారు. దేవేందర్ గౌడ్ లాగా విలువలతో కూడిన నాయకుల సంఖ్య తెలంగాణ రాజకీయాల్లో పెరగాల్సిన అవసరం ప్రస్తుత రాజకీయాల్లో ఎంతైనా ఉందన్నారు.

Next Story