పీజీ మెడికల్ సీట్లపై కొనసాగుతోన్న రగడ.. స్థానికులకే కేటాయించాలని డిమాండ్

by Kema Shiva Kumar |

ప్రైవేటు కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్ల ప్రవేశాల్లో తెలంగాణ వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.

పీజీ మెడికల్ సీట్లపై కొనసాగుతోన్న రగడ.. స్థానికులకే కేటాయించాలని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్ల ప్రవేశాల్లో తెలంగాణ వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. 25 శాతం మేనేజ్ మెంట్ కోటా సీట్ల (ఎంక్యూ-1)లో తెలంగాణలో మొత్తం ఆల్ ఇండియా కోటాకే కేటాయించి స్థానికులకు రిజర్వేషన్ లేని పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మాత్రం 25 శాతం మేనేజ్ మెంట్ కోటా సీట్లలో 85శాతం స్థానికులకే కేటాయిస్తూ అక్కడి సర్కారు ఉత్తర్వులు సైతం తీసుకువచ్చింది. తెలంగాణ విద్యార్థులు మాత్రం 25శాతం మేనేజ్ మెంట్ సీట్ల కోసం ఆల్ ఇండియా కాంపిటీషన్ లో పోటీ పడాల్సి వస్తోంది. ఫలితంగా మన విద్యార్థులు పీజీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఏపీ తరహాలో తెలంగాణలోనూ మేనేజ్ మెంట్ కోటా రిజర్వేషన్లను సవరించాల్సి ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి వైద్య విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేయగా... సర్కారు సైతం ఆ దిశగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

2017 జీవోతో తెలంగాణ విద్యార్థులకు నష్టం..

తెలంగాణలో 2017 మే 9న జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 40, 42 ప్రకారం ఎంక్యూ-1 కోటాలోని 25శాతం సీట్లు ఆల్ ఇండియా పోటీకి మాత్రమే కేటాయించబడి, స్థానిక రిజర్వేషన్ లేకుండా ఉన్నాయి. ఫలితంగా తెలంగాణ విద్యార్థులు ఆల్ ఇండియా పోటీని తట్టుకుని సీట్లు సాధించే పరిస్థితి అంత గొప్పగా ఏమీ ఉండటం లేదు. పొరుగు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం గత ఏడాది జులై 15న తీసుకువచ్చిన జీఓఎంఎస్. నంబర్ 102 ప్రకారం మేనేజ్ మెంట్ కోటా-1 సీట్లలో 85శాతం స్థానిక అభ్యర్థులకు కేటాయించి... కేవలం 15శాతం సీట్లను మాత్రమే ఆల్ ఇండియా కోటాగా ఉంచింది. ఫలితంగా ఏపీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ తెలంగాణలోని 2017 జీవోతో స్థానిక విద్యార్థులకే తీవ్ర అన్యాయం జరుగుతోంది. త్వరలోనే నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... స్థానిక విద్యార్థుల ప్రయోజనం చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకునాల్సి ఉందని. ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అనుసరిస్తే స్థానిక విద్యార్థులకు పెద్ద ఎత్తున న్యాయం జరుగుతుంది.

సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి..

తెలంగాణ విద్యార్థులకు పీజీ చేసేందుకు అన్యాయం జరగకుండా చూడాలని తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీ-జుడా) ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు లేఖ రాశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేదని.. పీజీ అడ్మిషన్ల విషయంలో మాత్రం మేనేజ్ మెంట్ కోటా-1 లోని 25శాతం సీట్లలో మొత్తం ఆల్ ఇండియా కోటా ఉంచడం వల్ల అన్యాయం జరుగుతోందని టీ జుడా డా.ఇసాక్ న్యూటన్ ‘దిశ’కు తెలిపారు. ఇందులో ఏపీ మాదిరిగా 85శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ట్లు తెలిపారు. ఎంక్యూ-1 సీట్లలో 85 శాతం స్థా నికులకు అవకాశం కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా సు మారు 600 వరకు పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థు లకే దక్కే అవకాశం ఉందని టీ జుడా ప్రధాన కార్యదర్శి డా.అజయ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని టీజుడా చెబుతోంది. ఇందుకు మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారని టీ జుడా తెలిపింది. త్వరలో పీజీ కౌన్సెలింగ్ ప్రారం భం కానున్న నేపథ్యంలో ప్రభు త్వం స్థానిక విద్యార్థులకు మేలు జరిగేలా ఉత్తర్వులు జారీ చేస్తుందని వైద్య వర్గాలు ఆశిస్తున్నాయి.

Next Story