తెలంగాణ నుంచి ఐదేండ్లుగా తగ్గుతున్న ఐపీఎస్‌‌ల సంఖ్య

by Malleboina Mahesh |

తెలంగాణ నుంచి ఐపీఎస్‌కు ఎంపిక అవుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గత ఐదేండ్ల గణంకాలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.

తెలంగాణ నుంచి ఐదేండ్లుగా తగ్గుతున్న ఐపీఎస్‌‌ల సంఖ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నుంచి ఐపీఎస్‌కు ఎంపిక అవుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గత ఐదేండ్ల గణంకాలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. 2023-24 లో ట్రైనింగ్ పూర్తి చేసిన ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు 1 శాతం మాత్రమే. ఇటీవల 77 ఆర్‌ఆర్ ఐపీఎస్ బ్యాచ్ అధికారులు ఫేజ్-1 శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 174 మంది శిక్షణ పూర్తి చేసుకోగా.. తెలంగాణ నుంచి ఎంపికైన వారు ఇద్దరే ఉన్నారు. రాష్ట్రానికి 163 మంది ఐపీఎస్ అధికారులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 139 మంది మాత్రమే ఉన్నారు.

4 శాతం నుంచి 1% పడిపోయిన తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఐపీఎస్‌కు ఎంపికై అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఐపీఎస్‌లకు అత్యున్నత శిక్షణ ఇచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ రాష్ట్రంలోనే ఉన్నా ఇక్కడి నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం అసంతృప్తిని మిగులుస్తోంది. గత ఐదేండ్ల నివేదికల ప్రకారం 73 బ్యాచ్‌లో 4 శాతం ఉండగా.. 74,75,76 బ్యాచ్‌లో 3 శాతానికి పరిమితం అయ్యారు. 77 బ్యాచ్‌కు వచ్చేసరికి 1శాతం నమోదైంది. ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యి శిక్షణలో ఉన్నారు.

కేడర్ వైస్ డిస్ట్రీబ్యూషన్‌లో 2శాతం

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను రాష్ట్రాలకు కేటాయించడం 2 శాతానికి పడిపోయింది. 73, 74 బ్యాచ్‌లలో 3 శాతం కేటాయించగా 75 బ్యాచ్‌లో 6శాతం కేటాయించారు. 76, 77 బ్యాచ్‌లలో కేవలం 2 శాతం మాత్రమే కేటాయించారు. 77 బ్యాచ్‌లో నలుగురు ఐపీఎస్ అధికారులను కేటాయించారు.

తమిళనాడు, కేరళలో కాస్త బెటర్..

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో కాస్త మెరుగ్గా ఉంది పర్సంటేజీ. కేరళ నుంచి 77 బ్యాచ్‌లో 5 శాతం మంది అధికారులు ఎంపికయ్యారు. గతంతో పోలిస్తే 2 శాతం పెరిగారు. తమిళనాడు నుంచి 7 శాతం ఉన్నారు. కేరళ మాదిరిగానే 2శాతం పెరిగారు. కేరళ నుంచి 8 మంది, తమిళనాడు నుంచి 12 మంది ఉన్నారు. యూపీ నుంచి అత్యధికంగా 20 శాతం మంది శిక్షణలో ఉన్నారు. 35 మంది 77వ బ్యాచ్లో శిక్షణ పొందారు. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ నుంచి 19, మహరాష్ట్ర 19, ఢిల్లీ నుంచి 17 మంది శిక్షణ పొందారు.

Next Story